మీడియా ప్రతినిధుల ముందే తీవ్ర వ్యాఖ్యలతో ఎదురుదాడికి దిగిన ఐబొమ్మ రవి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తనపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించిన రవి, “నా పేరు ఐబొమ్మ రవి కాదు. ఐబొమ్మ నాది అని మీకు ఎవరు చెప్పారు?” అంటూ మీడియాను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు.
పోలీస్ కస్టడీ ముగిసిన అనంతరం నిన్న రవిని ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ కోరగా, కోర్టు రిమాండ్ విధించింది. దీంతో రవిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈ క్రమంలో కోర్టుకు తరలిస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు రవితో మాట్లాడేందుకు ప్రయత్నించగా, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కాకుండా, వారినే తిరిగి ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
“నేను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశానని మీరు ఎలా చెబుతున్నారు? మీ దగ్గర ఆధారాలేమైనా ఉన్నాయా? పోలీసులు చెప్పిందే నిజమా? మీడియా కోర్టు కాదు. నేను మాట్లాడాల్సింది కోర్టులోనే” అంటూ ఘాటుగా స్పందించాడు.
విదేశాలకు పారిపోయాడనే ఆరోపణలపై కూడా రవి తీవ్రంగా స్పందించాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని, కూకట్‌పల్లిలోనే ఉన్నానని స్పష్టం చేస్తూ, కావాలని తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించాడు.
ఇదిలా ఉండగా, పోలీసుల విచారణలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. రవి తన అసలు గుర్తింపును దాచేందుకు ఇతరుల వ్యక్తిగత ధ్రువపత్రాలను దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మొదట తన స్నేహితుడు ప్రహ్లాద్ పత్రాలతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు రవి విచారణలో చెప్పినప్పటికీ, ప్రహ్లాద్‌ను విచారించగా అతనికి రవి ఎవరో కూడా తెలియదని వెల్లడైంది.
విచారణలో బయటపడిన వివరాల ప్రకారం, రవి జిరాక్స్ ధ్రువపత్రాలను అక్రమంగా సేకరించి, ఫొటో మాత్రమే మార్చి, మధ్యవర్తుల సహాయంతో ప్రభుత్వ గుర్తింపు పత్రాలు పొందినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో బ్యాంక్ ఖాతాల విషయంలోనూ తీవ్ర అక్రమాలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రవికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు ‘అంజయ్య’ అనే పేరుతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అంజయ్యను విచారించగా, అతనికి రవి ఎవరో తెలియదని, రవికీ అంజయ్య ఎవరో తెలియదని తేలింది. దీంతో అంజయ్య ధ్రువపత్రాలను దుర్వినియోగం చేసి బ్యాంక్ అధికారులను మోసం చేసి ఖాతాలు తెరిచినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, తదుపరి విచారణలో పూర్తి నిజాలు బయటపడతాయని పోలీసులు పేర్కొంటున్నారు.



