Hyderabad New Year Celebrations: డీజే మోతకు చెక్, న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కఠిన నిఘా

నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకేందుకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. యువతను ఆకర్షించే ఈవెంట్లతో హోటల్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్‌లు కళకళలాడుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల బుకింగ్స్ పూర్తవడంతో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ పోలీసులు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.

నగరంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా పబ్స్, కన్వెన్షన్ సెంటర్స్, గేటెడ్ కమ్యూనిటీలు, ఫామ్ హౌస్‌లపై కఠిన నిఘా ఏర్పాటు చేస్తున్నారు.


పబ్స్, రిసార్ట్స్‌పై స్పెషల్ ఫోకస్

హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో పబ్స్ ఉండగా, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోనే 70కి పైగా పబ్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటితోపాటు కన్వెన్షన్ సెంటర్స్, గేటెడ్ కమ్యూనిటీలలో నిర్వహించే ఈవెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు సంబంధించి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని సర్క్యులర్ కూడా జారీ చేశారు.


మైనర్లకు ఎంట్రీ నిషేధం.. డ్రగ్స్‌పై కఠిన చర్యలు

న్యూ ఇయర్ వేడుకలను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని మాదాపూర్ డీసీపీ రితిరాజ్ సూచించారు. పబ్స్, కన్వెన్షన్ సెంటర్స్, గేటెడ్ కమ్యూనిటీ యజమానులు తప్పనిసరిగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. మైనర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్స్‌లోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు.

వేడుకల్లో డ్రగ్స్ వినియోగంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని హెచ్చరించారు. ఈవెంట్ నిర్వాహకులు డ్రగ్స్‌కు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే ఐటీ కారిడార్ పరిధిలో ఈవెంట్ ఆర్గనైజర్లతో సమన్వయ సమావేశం నిర్వహించి మార్గదర్శకాలు ఇచ్చారు.


డీజే మోతకు చెక్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిఘా

న్యూ ఇయర్ వేడుకల్లో శబ్ద కాలుష్యం జరగకుండా డీజే సౌండ్‌పై నియంత్రణ తప్పనిసరి అని పోలీసులు పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి, నిర్ణీత సామర్థ్యానికి మించి జనాన్ని అనుమతించకూడదని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ రితిరాజ్ హెచ్చరించారు.


మొయినాబాద్ ఫామ్ హౌస్‌లపై పోలీసుల డేగ కన్ను

నగర శివారులోని మొయినాబాద్ డివిజన్‌లో సుమారు 500కు పైగా ఫామ్ హౌస్‌లు ఉండగా, న్యూ ఇయర్ సందర్భంగా దాదాపు అన్నీ బుక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ ఫామ్ హౌస్ యజమానులతో సమావేశం నిర్వహించారు.

ఫామ్ హౌస్‌లలో లిక్కర్‌కు అనుమతి లేకుండా పార్టీలు నిర్వహించినా, డ్రగ్స్ వాడినప్పటికీ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేశారు.


ప్రశాంత న్యూ ఇయర్ లక్ష్యంగా ముందస్తు చర్యలు

మొత్తంగా హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా, భద్రతతో జరిగేలా పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. ఈవెంట్ నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి