హైదరాబాద్ నగరంలో మరోసారి మానవత్వాన్ని కుదిపేసే అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న పిల్లల కళ్లెదుటే కట్టుకున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చర్య నగరాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ హృదయ విదారక సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో, క్రిస్మస్‌కు ఒక రోజు ముందు అంటే ఈ నెల 24న చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వెంకటేశ్, త్రివేణి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా భార్య త్రివేణి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వెంకటేశ్, తరచూ గొడవలు పెట్టుకుంటూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడని సమాచారం. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.
భర్త వేధింపులు తాళలేక త్రివేణి ఇటీవల తన పుట్టింటికి వెళ్లింది. అయితే తన ప్రవర్తన మార్చుకుంటానని, ఇకపై ఎలాంటి ఇబ్బందులు పెట్టనని వెంకటేశ్ నమ్మబలకడంతోనే ఆమె తిరిగి భర్త వద్దకు వచ్చినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే ఆమె తిరిగి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ఘోరం చోటుచేసుకుంది.
ఈ నెల 24న పిల్లల ముందే భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగిన వెంకటేశ్, కోపంలో ఆమెపై దాడి చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న పెట్రోల్‌ను త్రివేణిపై పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న తల్లిని చూసిన కుమార్తె ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా, నిందితుడు ఆమెను కూడా నిప్పుల్లోకి తోసివేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
వారి అరుపులు విన్న చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకునేలోపే త్రివేణి తీవ్ర కాలిన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తెకు స్వల్ప గాయాలు కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుమారుడు తీవ్ర భయాందోళనకు గురైనట్లు సమాచారం.
ఈ ఘటనపై నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేశ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
పిల్లల ముందే తల్లిని సజీవ దహనం చేయడం వంటి అమానుష చర్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహిళల భద్రత, గృహహింస నివారణపై మరోసారి సమాజంలో చర్చకు దారి తీసింది. నగరంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



