హైదరాబాద్ చేరుకునే దారుల్లో హైవేల వెంట ఉన్న దాబాలు ఇప్పుడు ప్రయాణికులకు ప్రధాన ఆహార కేంద్రాలుగా మారాయి. దూర ప్రాంతాల నుంచి వస్తున్నవారు వీటిలో తినడం సాధారణమే. వేడివేడిగా వడ్డించే వంటకాలు ఆకలి తీర్చినా, ఆహార నాణ్యత, పరిశుభ్రతపై చాలా మంది పట్టించుకోరు. అయితే తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన ఆకస్మిక తనిఖీలతో అనేక దాబాల్లో భయంకర వాస్తవాలు బయటపడ్డాయి.
హైదరాబాద్‌కు వచ్చే నేషనల్ హైవేలపై ఉన్న 12 దాబాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అందులోని కిచెన్లలో కనిపించిన దృశ్యాలు షాక్‌కు గురి చేశాయి. వంటగదుల్లో క్రిమికీటకాలు తిరుగుతుండడం, ఎలుకల మలం కనిపించడం, కవర్ చేయని ఆహారం ఎక్కడ పడితే అక్కడ ఉంచడం, వెజ్–నాన్ వెజ్ వంటకాలను ఒకేచోట నిల్వ చేయడం వంటి విపరీతమైన నిర్లక్ష్యాలు గుర్తించారు.
🔹 మూడు ప్రధాన హైవేలపై తనిఖీలు
ఎన్‌హెచ్–65 (హైదరాబాద్–విజయవాడ), ఎన్‌హెచ్–163 (వరంగల్–హైదరాబాద్), ఎన్‌హెచ్–44 (కర్నూల్–హైదరాబాద్) మార్గాల్లో ఉన్న దాబాలపై అధికారులు దృష్టి సారించారు. తనిఖీల్లో:
- తేదీ ముగిసిన పదార్థాలు,
- కుళ్లిన మాంసం, ఆహార పదార్థాలు,
- సింథటిక్ కలర్స్ వినియోగం,
- పరిశుభ్రత లేకుండా వంట
వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.
🔹 సంగారెడ్డి ‘ది ప్యాలెస్ హోటల్’లో భయానక దృశ్యం
సంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలో ఉన్న ది ప్యాలెస్ హోటల్లో అధికారులు నిర్వహించిన తనిఖీలో కిచెన్‌లో ఎలుకల మలం, క్రిములు, కవర్ చేయని ఆహారం, వెజ్–నాన్ వెజ్ పదార్థాలు కలిపి నిల్వ చేయడం, సింథటిక్ కలర్స్ వినియోగం వంటి భయంకర విషయాలు బయటపడ్డాయి.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 ప్రకారం, అధికారులు 107 కిలోల పాడైన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. ఇందులో ప్రాన్స్, చికెన్, మటన్, పనీర్, గోబీ ఫ్రై వంటి పదార్థాలు ఉన్నాయి. సంబంధిత హోటల్‌ను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
🔹 ఇతర దాబాల్లో కూడా ఉల్లంఘనలు
- ఎన్‌హెచ్–65 రహదారిపై చౌటుప్పల్ మండలం కోయలగూడెం వద్ద ‘అతిథి రెస్టారెంట్’లో కుళ్లిన ఆహారం గుర్తించి సీజ్ చేశారు.
- చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామంలోని ‘ఉత్సవ్ రెస్టారెంట్’లో కూడా ఆహారం పాడైన స్థాయిలో ఉన్నట్లు తేలింది.
- కోయలగూడెం సంగం హోటల్‌లో నాణ్యమైన ఆహారం అందించడం లేదని తేల్చారు.
- ఎన్‌హెచ్–44 రహదారిపై గద్వాల్‌లోని ‘తాజ్ ప్యాలెస్’ మరియు ‘అతిథి రెస్టారెంట్లలో’ ఆహార నమూనాలను ల్యాబ్‌కు పంపారు.
- ఎన్‌హెచ్–163లోని హోటల్ వివేరాలో 2 కిలోల ఎక్స్‌పైరీ గ్రేవీ, పాత కూల్‌డ్రింక్స్ నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
🔹 అధికారులు హెచ్చరిక
ప్రజలు ఆహారం తినే ముందు పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని, దాబాలు, రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.



