హైదరాబాద్;
భాగ్యనగరంపై ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం నగరాన్ని స్తంభింపజేసింది. కేవలం గంటసేపులోనే 12 సెం.మీ. వరకు వర్షపాతం నమోదై, రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక వీధుల్లో వరదనీరు ఉప్పొంగి వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించింది.
వరదల్లో గల్లంతైన ముగ్గురు యువకులు
ఆసిఫ్‌నగర్ హబీబ్‌నగర్‌లో మామ, అల్లుడు వరద నీటిలో కొట్టుకుపోయారు. ముషీరాబాద్ వినోద్‌నగర్‌లో సన్నీ అనే యువకుడు పిట్టగోడపై కూర్చొని స్నేహితులతో మాట్లాడుతుండగా, గోడ కూలిపోవడంతో నాలాలో పడిపోయి కొట్టుకుపోయాడు. స్థానికులు రక్షించడానికి ప్రయత్నించినా, వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ఆయన గల్లంతయ్యాడు. వెంటనే పోలీసులు, జిహెచ్ఎంసి, డిజాస్టర్ రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
వట్టినాగులపల్లిలో విషాదం
గచ్చిబౌలి పరిధి వట్టినాగులపల్లిలో భారీ వర్షం కారణంగా ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ట్రాఫిక్ జామ్ – ప్రజలకు ఇబ్బందులు
హైటెక్ సిటీలో వర్షం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ఇరుక్కుపోయారు. నగరంలోని మియాపూర్, కూకట్పల్లి, షేక్‌పేట, రాయదుర్గం, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, హిమాయత్‌నగర్, రామ్‌నగర్, ఎల్బీనగర్, తార్నాక, కాచిగూడ, అల్వాల్, మల్కాజ్గిరి, కుషాయిగూడ, కాప్రా, ఉప్పల్, టోలీచౌకి, శేరిలింగంపల్లి, కీసర వంటి అనేక ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపించాయి. వాహనాల కదలికలు తీవ్రంగా అడ్డంకులకు గురయ్యాయి.
గరిష్ట వర్షపాతం గడ్డియన్నారం
రాష్ట్ర వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, ఆర్ఆర్ జిల్లా గడ్డియన్నారంలో గరిష్టంగా 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ ముషీరాబాద్‌లో 12 సెం.మీ, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 10 సెం.మీ, అడిక్‌మెట్‌లో 9 సెం.మీ, హిమాయత్‌నగర్‌లో 7 సెం.మీ, మల్కాజ్‌గిరిలో 6 సెం.మీ, ఉప్పల్‌లో 7 సెం.మీ, అల్వాల్‌లో 7 సెం.మీ, గండిపేటలో 7 సెం.మీ, బండ్లగూడలో 5 సెం.మీ, నాంపల్లిలో 5 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.



