హైదరాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో దారుణం: లెక్చరర్ల అవమానం తట్టుకోలేక దళిత ఇంటర్ విద్యార్థిని మృతి

హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చోటుచేసుకున్న దారుణ ఘటన కలకలం రేపుతోంది. లెక్చరర్ల అవమానకర ప్రవర్తన కారణంగా మానసిక వేదనకు గురైన దళిత ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది.

సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి పరిధిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థిని ఇటీవల కాలేజీకి ఆలస్యంగా చేరుకుంది. ఈ కారణంగా లెక్చరర్లు శ్రీలక్ష్మి, మధురిమ ఆమెను క్లాస్‌లోకి అనుమతించలేదు. ఈ సందర్భంగా విద్యార్థిని తనకు పీరియడ్స్ వచ్చాయని చెప్పగా, లెక్చరర్లు దురుసుగా స్పందిస్తూ “నాటకాలు ఆడుతున్నావా? ఏది చూపించు” అంటూ అవమానించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనతో తీవ్రంగా మనస్తాపానికి గురైన విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, మెదడులో బ్లడ్ క్లాట్ ఏర్పడిన కారణంగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

విద్యార్థిని మృతితో కాలేజీ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత విద్యార్థినిపై జరిగిన అవమానకర ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి