హైదరాబాద్‌లో దేశంలోనే తొలి డ్రైవర్‌లెస్ బస్సులు – ఐఐటీ హైదరాబాదు కొత్త సాంకేతిక ఆవిష్కరణ

హైదరాబాద్‌ నగరం మరో గర్వకారణమైన ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే తొలి సారిగా డ్రైవర్‌ లేకుండానే నడిచే బస్సులు ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. డ్రైవర్‌ అవసరం లేకుండా, పూర్తిగా ఆటోమేటిక్‌ టెక్నాలజీతో నడిచే ఈ బస్సులు వేగాన్ని స్వయంగా నియంత్రించుకుంటాయి. రోడ్డుపై స్పీడ్‌ బ్రేకర్లు లేదా అడ్డంకులు ఎదురైనప్పుడు స్వయంగా బ్రేకులు వేస్తాయి. ప్రస్తుతం ఈ బస్సులు ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో ప్రయోగాత్మకంగా నడుస్తున్నాయి. ఎంపిక చేసిన మార్గాల్లో వీటిని పూర్తిస్థాయిలో నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ బస్సులు అటానమస్ నావిగేషన్ డేటా అక్విజిషన్ సిస్టమ్ అనే ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. పూర్తిగా విద్యుత్తుతో నడిచే వీటిలో రెండు మోడళ్లు ఉన్నాయి – ఒకటి 6 సీటర్ల మినీ బస్‌, మరొకటి 14 సీటర్ల పెద్ద బస్‌. గత మూడు రోజులుగా ఐఐటీ విద్యార్థులు, సిబ్బంది మెయిన్‌ గేటు నుంచి క్యాంపస్‌ లోని వివిధ ప్రాంతాలకు ఈ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.

టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ విభాగం ఈ డ్రైవర్‌లెస్ బస్సు సాంకేతికతను అభివృద్ధి చేసింది. బస్సుల్లో అమర్చిన అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ వల్ల వాహన వేగం, మార్గం పూర్తిగా ఆటోమేటిక్‌గా నియంత్రితమవుతుంది. ఏఐ ఆధారిత సెన్సార్లు, కెమెరాలు రోడ్డుపై అడ్డంకులను గుర్తించి సురక్షిత మార్గాన్ని ఎంచుకునే విధంగా రూపకల్పన చేశారు.

ఇప్పటికే ఈ బస్సుల్లో ప్రయాణించిన విద్యార్థులు, సిబ్బంది సానుకూల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ నగరంలో మరిన్ని మార్గాల్లో ఈ బస్సులను నడపాలని ఐఐటీ అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వినూత్న రవాణా విధానం గురించి నగరవాసుల్లో ఆసక్తి పెరుగుతోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి