మావోయిస్టు నాయకుల లొంగుబాట్లు వరుసగా జరుగుతున్న ఈ తరుణంలో, ఆ పార్టీలో కీలక మిలిటరీ కమాండర్‌గా ఉన్న హిడ్మా కూడా లొంగిపోబోతున్నాడనే ప్రచారం చెలామణిలో ఉంది. సుమారు 200 మంది మావోయిస్టులతో కలిసి ఆయన సరెండర్ కావడానికి సన్నాహాలు చేస్తున్నాడని భద్రతా వర్గాల్లో చర్చ నడుస్తోంది. సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా మావోయిస్టు పాఠశాలలో చదివి చిన్న వయసులోనే ఆందోళనలో చేరాడు. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్రనేతలతో కలిసి పని చేసిన హిడ్మా, ఎన్నో పెద్ద దాడులకు వ్యూహరచన చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు.
భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడుల వెనుక హిడ్మా ప్రధాన పాత్ర పోషించాడని అధికారులు చెబుతున్నారు. చింతల్నారు దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటన, జీరం ఘాటీ దాడిలో మహేంద్ర కర్మతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, పోలీసులు ప్రాణాలు కోల్పోయిన ఘటనల్లో హిడ్మా పేరు ప్రధానంగా వినిపించింది. ఈ కారణంగా ఆయన లొంగిపోతే మావోయిస్టు ఉద్యమం తుదిదశలోకి చేరినట్టేనని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి.
ఇదే సమయంలో వరుస లొంగుబాట్ల నేపథ్యంలో హిడ్మా ఎక్కడ ఉన్నాడన్న చర్చ దేశవ్యాప్తంగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర కమిటీల నేతలు సాయుధ పోరాటాన్ని విరమించి ఆయుధాలతో సహా లొంగిపోతున్న తరుణంలో కూడా, హిడ్మా మాత్రం వెనుకడుగు వేయకుండా పార్టీ లైనును కొనసాగిస్తున్నాడు. ఆయనను పట్టుకోకపోతే నక్సలిజం నిర్మూలన పూర్తవ్వదని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం హిడ్మా డీకేఎస్‌జెడ్‌సీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. హిడ్మాతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీపై కూడా పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని సమాచారం. ఇటీవల బస్తర్ పోలీసులకు లొంగిపోయిన హిడ్మా అనుచరుడు లక్మూ ఇచ్చిన సమాచారం ప్రకారం — ఏప్రిల్‌లో జరిగిన ‘కర్రెగుట్టల ఆపరేషన్’ నుంచి హిడ్మా తృటిలో తప్పించుకున్నాడని, మే, జూన్ నెలల్లో బసవరాజ్ వంటి నేతల ఎన్కౌంటర్ల తరువాత మళ్లీ కర్రెగుట్టల ప్రాంతానికి చేరాడని చెబుతున్నారు.
ఇక ప్రస్తుతం హిడ్మా తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నాడని విశ్వసనీయ సమాచారం. దీంతో కేంద్ర బలగాలు ఆయన లొంగిపోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన సహచరులతో చర్చలు జరుపుతున్నాడని ప్రచారం ఉంది. భద్రతా బలగాలు మరోసారి “ఆపరేషన్ కర్రెగుట్టలు” చేపట్టకముందే తన సహచరులతో కలిసి లొంగిపోవాలనే ఆలోచనలో ఉన్నాడని వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది — హిడ్మా తెలంగాణలో లొంగిపోతాడా? లేక చత్తీస్‌గఢ్‌లోనా? అనే ప్రశ్న. తన సహచరులను మరింతగా కోల్పోకముందే పోలీసుల ఎదుట లొంగిపోవడమే సరైన నిర్ణయమని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. హిడ్మా నిజంగా లొంగిపోతే, మావోయిస్టు ఉద్యమం దాదాపుగా ముగిసినట్టే అనే అభిప్రాయం భద్రతా వర్గాలు, రాజకీయ విశ్లేషకుల మధ్య బలంగా వినిపిస్తోంది.



