హిడ్మా ఎన్‌కౌంటర్ పై మావోయిస్టుల సంచలన లేఖ: దేవ్‌జీపై ఆరోపణలు అబద్ధం అని ఖండన

మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ (డీకేఎస్‌జడ్‌సీ) కార్యదర్శి వికల్ప్ పేరుతో మరో సంచలనాత్మక లేఖ వెలువడింది. ఇటీవల జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌పై కొనసాగుతున్న వివాదాలకు ఈ లేఖ కీలకంగా మారింది.

హిడ్మా ఆచూకీని దేవ్‌జీ పోలీసులకు ఇచ్చారనే ప్రచారాన్ని పార్టీ పూర్తిగా ఖండించింది. “దేవ్‌జీతో పాటు మళ్లా రాజిరెడ్డి ఇప్పటికీ మా వెంటనే ఉన్నారు. లొంగిపోవడానికి వారు ఎలాంటి చర్చలు జరిపిన విషయమే లేదు. హిడ్మా వివరాలను దేవ్‌జీ అందించాడనే ప్రచారం పూర్తిగా అబద్ధం” అని లేఖలో స్పష్టం చేశారు.

హిడ్మా హత్య వెనుక నలుగురు వ్యక్తులే ఉన్నారని లేఖ పేర్కొంది. అడవి నుంచి బయటికి వెళ్లిన కోసాల్‌ అనే వ్యక్తినే ఈ హత్యకు ప్రధాన కారకుడిగా పేర్కొన్నారు. అలాగే విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ ఈ కుట్రలో పాత్రధారులని తెలిపారు.

అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి సహాయంతో హిడ్మా విజయవాడకు వచ్చినట్టు లేఖ వివరిస్తోంది. ఆ సమాచారమే పోలీసుల చెంతకు వెళ్లడంతో 13 మంది పట్టుబడి హత్యకు గురయ్యారని ఆరోపించారు.

హిడ్మా హత్యను కప్పిపుచ్చేందుకు మారేడుమల్లి–రంపచోడవరం ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్ కథలను సృష్టించారని మావోయిస్టులు పేర్కొన్నారు. ఇది ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ కాదని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అని లేఖలో ఆరోపించారు. “హిడ్మా ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా మా పోరాటం కొనసాగుతుంది” అని లేఖ చివర్లో పేర్కొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి