విద్యార్థుల భద్రతకు కంచెగా నిలవాల్సిన గురుకుల పాఠశాలలో జరిగిన ఘోర ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని, ఆయా విద్యాసంస్థలో పనిచేస్తున్న మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగికంగా వేధించినట్టు వెలుగులోకి రావడంతో విద్యావేత్తలు, తల్లిదండ్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనను దాచిపెట్టే ప్రయత్నం చేసిన ప్రిన్సిపాల్‌తో పాటు, వైస్ ప్రిన్సిపాల్‌పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే… జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విచారణలో బయటపడింది. ఇటీవల పాఠశాలలో షీ టీమ్స్ నిర్వహించిన అవగాహన కార్యక్రమం వల్ల ధైర్యం వచ్చిన బాధిత విద్యార్థిని, తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని సంబంధిత అధికారులకు వివరించింది. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తులోకి దిగారు. ఆగస్టు నెల నుంచే రాజ్యలక్ష్మి ఈ వేధింపులకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. నైట్ డ్యూటీ సమయంలో విద్యార్థినిపై శారీరకంగా, లైంగికంగా దాడి చేసినట్లు ఆధారాలు లభించాయని చెప్పారు. ఇదే విషయాన్ని బయటకు చెప్పొద్దని ప్రిన్సిపాల్ రజిని రాగమాల బాధిత విద్యార్థినిపై, ఆమె తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు కూడా దర్యాప్తులో తెలిసింది.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి, వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ రజిని రాగమాల ఇద్దరినీ తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి, పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



