గుంటూరు మిర్చి అంటే ఘాటు, రుచి, అంతర్జాతీయ గుర్తింపు వెంటనే గుర్తుకు వస్తాయి. అయితే ఇప్పుడు అదే మిర్చి సాగులో రైతులకు కొత్త లాభదాయక అవకాశంగా ‘పసుపు మిర్చి’ వెలుగులోకి వచ్చింది. దిగుబడి పరంగా కొంత తక్కువగా ఉన్నప్పటికీ, అధిక ధర, విదేశీ డిమాండ్, ప్రత్యేక వినియోగాల కారణంగా ఈ పసుపు మిర్చి రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తోంది.
పల్నాడు జిల్లా మాచర్ల పరిసర ప్రాంతాలు, అలాగే ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఇప్పటికే కొంతమంది రైతులు ఈ ప్రత్యేక పసుపు మిర్చి సాగు చేస్తున్నారు. ఈ రకం మిర్చి మొదట ఆకుపచ్చగా పండుతుండగా, పూర్తిగా పక్వానికి వచ్చేసరికి పసుపు రంగులోకి మారుతుంది. ముఖ్యంగా ఎండిన తర్వాత కూడా రంగు మారకుండా పసుపు వర్ణాన్ని నిలుపుకోవడం దీని ప్రత్యేకత. యూవీ, నరింగా F-1 వంటి హైబ్రిడ్ విత్తనాలతో ఈ పంటను సాగు చేస్తున్నారు.
సాధారణ ఎరుపు గుంటూరు మిర్చి ఒక ఎకరాకు సగటున 30 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ధర క్వింటాకు సుమారు రూ.18,000 వరకు ఉంటుంది. అదే పసుపు మిర్చి విషయానికి వస్తే, దిగుబడి ఒక ఎకరాకు సుమారు 25 క్వింటాళ్లు మాత్రమే అయినప్పటికీ, ప్రస్తుతం క్వింటాకు రూ.49,200 వరకు ధర పలుకుతోంది. సాగు ఖర్చులు లెక్కిస్తే, ఒక ఎకరానికి సుమారు రూ.1.15 లక్షల వరకు పెట్టుబడి అవసరం. 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లయితే, రైతుకు దాదాపు రూ.12.3 లక్షల స్థూల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
అమెరికా సహా విదేశీ మార్కెట్లలో భారీ డిమాండ్…
పసుపు మిర్చికి విదేశీ మార్కెట్లలో డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లోని ఆహార పరిశ్రమలు ఈ మిర్చిని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. వివిధ రకాల సాస్‌ల తయారీ, ఫుడ్ డెకరేషన్, స్నాక్స్ గార్నిష్ వంటి అవసరాలకు ఇది విస్తృతంగా ఉపయోగపడుతోంది. రెస్టారెంట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి ప్రత్యేక ఆర్డర్లు వస్తుండటంతో, ఎగుమతుల ద్వారా మరింత లాభాలు పొందే అవకాశం ఉంది.
రైతులకు నిపుణుల సూచనలు…
◆ పంట పర్యవేక్షణ: కాయలు ఆకుపచ్చ నుంచి పసుపు రంగులోకి మారే దశలో సరిపడా నీరు, సేంద్రియ ఎరువులు అందించడం చాలా ముఖ్యం. ఈ దశలో నిర్లక్ష్యం చేస్తే రంగు, నాణ్యతపై ప్రభావం పడే అవకాశముంది.
◆ ఎండబెట్టే విధానం: పసుపు రంగు నిలిచేలా, ఎండిన తర్వాత కూడా గోధుమ రంగు రాకుండా ఉండేందుకు తక్కువ ఉష్ణోగ్రతలో, శాస్త్రీయ పద్ధతుల్లో వడికపెట్టాలి.
◆ క్రాప్ మిక్సింగ్: పసుపు మిర్చితో పాటు ఎరుపు మిర్చిని కలిపి విక్రయిస్తే, చిన్న రైతులు కూడా మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణ పొందడంతో పాటు అదనపు ఆదాయం సాధించవచ్చు.
◆ ఎగుమతి అవకాశాలు: విదేశీ మార్కెట్లను లక్ష్యంగా పెట్టుకునే రైతులు నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. శుభ్రమైన ప్యాకింగ్, USDA, ISO వంటి అంతర్జాతీయ సర్టిఫికేషన్లు ఉండేలా చూసుకోవాలి.
◆ విత్తన స్వచ్ఛత: ఇతర హైబ్రిడ్ రకాలతో క్రాస్ అవకుండా, ప్రత్యేక పసుపు మిర్చి రకాన్ని వేరు చేసి సాగు చేయడం ద్వారా దీని ప్రత్యేక గుర్తింపు నిలుపుకోవచ్చు.



