ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక స్థానం సంపాదించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ సోమవారం (జనవరి 12) సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
ఆదివారం మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని వెలమ వీధిలో తన నివాసంలో ఉన్న సమయంలో కాలు జారి పడిపోయిన గుండ అప్పల సూర్యనారాయణకు తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రమవడంతో వైద్యులు ఆయనను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర చికిత్స అందించారు.
అయితే సోమవారం సాయంత్రానికి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని అరసవల్లిలోని స్వగృహానికి తరలించారు. మంగళవారం అరసవల్లిలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
సాధారణ కౌన్సిలర్ నుంచి మంత్రిగా ఎదిగిన రాజకీయ ప్రస్థానం
గుండ అప్పల సూర్యనారాయణ రాజకీయ జీవితాన్ని శ్రీకాకుళం మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రారంభించారు. ఆ తరువాత మున్సిపల్ వైస్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. ముక్కుసూటి స్వభావం, అవినీతి ఆరోపణలు లేని నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
1985 నుంచి వరుసగా నాలుగు సార్లు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989లో ఎన్టీఆర్ కేబినెట్‌లో కొంతకాలం మంత్రిగా కూడా సేవలందించారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయనది కీలకమైన పాత్రగా గుర్తింపు పొందింది.
కుటుంబ నేపథ్యం
గుండ అప్పల సూర్యనారాయణకు భార్య గుండ లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2014 ఎన్నికల్లో గుండ లక్ష్మీదేవి శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985 నుంచి 2019 వరకు శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ టీడీపీ తరఫున గుండ దంపతులకే కేటాయించబడింది.
అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం కొత్త అభ్యర్థి గొండు శంకర్‌కు అవకాశం ఇచ్చింది. భర్త మృతితో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కన్నీటి పర్యంతమవుతూ విలపిస్తున్నారు.



