గుజరాత్‌లో అంబులెన్స్‌ అగ్నిప్రమాదం: పసికందు సహా నలుగురు దారుణ మృతి

గుజరాత్‌లో మరో ఘోర విషాదం చోటుచేసుకుంది. అర్వల్లీ జిల్లాలోని మొదాస పట్టణం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున అంబులెన్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి నవజాత శిశువు, వైద్యుడు సహా నలుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం—పుట్టిన ఒక్కరోజులోనే అనారోగ్యానికి గురైన పసికందును మెరుగైన చికిత్స కోసం మొదాసలోని ఆసుపత్రి నుంచి అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇదే సమయంలో, మంగళవారం తెల్లవారుజామున సుమారు ఒక గంట ప్రాంతంలో మొదాస–ధన్సురా రహదారిపై అంబులెన్స్ వెనుక భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ఈ దుర్ఘటనలో పసికందుతో పాటు ఆ చిన్నారి తండ్రి జిగ్నేష్ మోచీ (38), డాక్టర్ శాంతిలాల్ రెంటియా (30), నర్సు భూరిబెన్ మానత్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక భాగం నుంచి మంటలు ఎగిసిపడుతుండటాన్ని గమనించిన డ్రైవర్ అంకిత్ ఠాకూర్ వెంటనే వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్‌తో పాటు ముందు సీట్లలో ఉన్న గౌరంగ్ మోచీ, గీతాబెన్ মోచీ గాయాలతో బయటపడగా, వెనుక భాగంలో ఉన్న నలుగురు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే నష్టం జరిగిపోయింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించినట్లు జిల్లా ఎస్పీ మనోహర్‌సిన్హ్ జడేజా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు వారు వెల్లడించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి