బంగారం ధరల్లో పెను మార్పుకు ఈ వారమే కీలకం.. తగ్గుతుందా లేక పెరుగుతుందా? ఉత్కంఠలో ఇన్వెస్టర్లు

ఇటీవలి రోజులుగా నేల చూపులు చూసిన బంగారం ధరలు ఒక్కసారిగా దిశ మార్చుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సంకేతాలతో పసిడి మళ్లీ కొండెక్కుతోంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతున్న వేళ ధరలు ఎగబాకడం మధ్యతరగతి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు పెట్టుబడిదారులు కూడా కొనుగోలు చేయాలా… వేచి చూడాలా అన్న సందిగ్ధంలో పడిపోయారు.

అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతుండటం, అమెరికా ఆర్థిక డేటాపై మార్కెట్ల దృష్టి కేంద్రీకృతమవడం వల్ల బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారమే బులియన్ మార్కెట్‌కు కీలకంగా మారింది.

అంతర్జాతీయ డేటాపై బులియన్ మార్కెట్ చూపు

అమెరికా నుంచి విడుదల కానున్న ద్రవ్యోల్బణ గణాంకాలు (CPI), జీడీపీ డేటా, PMI రిపోర్టులు, వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు బంగారం ధరల దిశను నిర్ణయించనున్నాయి. ఈ కీలక డేటా ముందురోజుల్లో మార్కెట్‌లో అప్రమత్త వాతావరణం నెలకొంది.

విశ్లేషకుల అంచనాల ప్రకారం వచ్చే వారం బంగారం ధరలు పరిమిత శ్రేణిలో స్థిరంగా కదలాడే అవకాశముంది. అయితే వెండి ధరలు మాత్రం మరింత అస్తిరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

కోమెక్స్‌లో బంగారం బలమైన రికవరీ

గత వారం అంతర్జాతీయ మార్కెట్‌లో కోమెక్స్ బంగారం గణనీయమైన రికవరీ చూపించింది. ఔన్సుకు సుమారు 4,400 డాలర్ల కనిష్ట స్థాయి నుంచి దాదాపు 5,000 డాలర్ల వరకు ఎగబాకింది. వారాంతానికి దాదాపు 5 శాతం లాభాన్ని నమోదు చేసింది.

ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా షార్ట్ కవరింగ్, విలువ ఆధారిత కొనుగోళ్లు, సేఫ్-హెవెన్ డిమాండ్ కొంత మేరకు తిరిగి రావడం వంటి అంశాలను మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

వెండి మాత్రం బలహీనంగానే…

బంగారం రికవరీ చూపించినప్పటికీ వెండి పరిస్థితి భిన్నంగా ఉంది. గత వారంలో వెండి ఫ్యూచర్స్ ధరలు సుమారు 2 శాతం తగ్గాయి. భారీ ఊహాజనిత పొజిషన్లు, మార్జిన్ కాల్స్, లిక్విడేషన్ ఒత్తిడి వెండిపై ఎక్కువ ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పారాబోలిక్ ర్యాలీ తర్వాత సహజంగా వచ్చే దిద్దుబాటు దశలో ప్రస్తుతం వెండి ప్రయాణిస్తోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ద్రవ్యోల్బణమే కీలక నిర్ణయకర్త

వచ్చే రోజుల్లో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు సంకేతాలు ఇస్తే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు బలపడే అవకాశం ఉంది. అలా జరిగితే బంగారం ధరలకు మద్దతు లభించే అవకాశముంది.

అయితే ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదైతే డాలర్ బలపడే అవకాశం ఉంది. దాని ప్రభావంగా బంగారం, వెండిపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చైనా, భారత్ డేటాపై కూడా ఫోకస్

చైనా, జర్మనీ, భారత్ నుంచి వచ్చే ద్రవ్యోల్బణ గణాంకాలను కూడా అంతర్జాతీయ వ్యాపారులు నిశితంగా గమనిస్తున్నారు. ముఖ్యంగా చైనాలో భౌతిక బంగారం, వెండికి ఉన్న డిమాండ్ ఆసియా మార్కెట్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపనుంది.

చైనాలో పండుగల సీజన్‌కు ముందు భౌతిక డిమాండ్ స్థిరంగా ఉండటం వెండికి కొంత మేరకు మద్దతు ఇవ్వవచ్చని అంచనా. దేశీయంగా MCX మార్కెట్‌లో గత వారం బంగారం ధరలు గణనీయంగా పెరిగినా, వెండి మాత్రం భారీగా పడిపోయింది.

దీర్ఘకాలికంగా బంగారం బలమే

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుల ప్రకారం, ఇటీవల బంగారం, వెండి రెండింటిలోనూ దశాబ్దాల తర్వాత చూడని స్థాయిలో దిద్దుబాట్లు నమోదయ్యాయి. అయితే తీవ్ర అమ్మకాల అనంతరం ఇప్పుడు స్థిరీకరణ సంకేతాలు కనిపిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.

ప్రత్యేకంగా బంగారంలో డిప్స్‌పై కొనుగోళ్లు తిరిగి వస్తుండటం పాజిటివ్ సంకేతమని, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగడం, సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచడం, ETF పెట్టుబడులు కొనసాగడం వల్ల దీర్ఘకాలికంగా బంగారం ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే స్వల్పకాలంలో డేటా ఆధారిత హెచ్చుతగ్గులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి