బంగారం అంటే అందరికీ ఆకర్షణే. కానీ ఆ అభిమానం కొందరిలో అతి స్థాయికి చేరి పిచ్చిగా మారుతుంది. ఒంటి నిండా బంగారం వేసుకుని తిరిగేవారిని చూసిన వారు ఆశ్చర్యపడవచ్చు. అయితే దొంగలు, గ్యాంగ్‌స్టర్ల దృష్టికి మాత్రం వారు సజీవ టార్గెట్‌లుగా కనిపిస్తారు. రాజస్థాన్‌లో ‘చిత్తోర్‌గఢ్ గోల్డ్ మ్యాన్’ గా పేరుపొందిన వ్యక్తి ఇప్పుడు అలాంటి భయానక పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. అతను వేసుకున్న బంగారమే ఇప్పుడు అతని ప్రాణాలకు ముప్పుగా మారింది.
చిత్తోర్‌గఢ్‌కు చెందిన కన్హయ్యలాల్ ఖటిక్ స్థానికులకు మంచి పరిచయం. బప్పీ లహరి శైలిలో ఒంటి మీద భారీగా బంగారు నగలు ధరించడమే అతని ప్రత్యేకత. బంగారం పై అతని మక్కువ కారణంగా ప్రజలు స్నేహపూర్వకంగా ‘చిత్తోర్‌గఢ్ బప్పీ లహరి’ అని పిలిచేవారు. అయితే రెండు రోజుల క్రితం అతనికి వచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్, వెంటనే చేరిన ఆడియో మెసేజ్ అతని జీవితం మొత్తాన్ని కుదిపేశాయి. అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే ప్రాణాలతో చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టమైన హెచ్చరిక అందింది.
వివరాల్లోకి వెళ్తే—కన్హయ్యలాల్ గతంలో కూరగాయలు అమ్ముతూ జీవనోపాధి సాగించాడు. తర్వాత పండ్ల వ్యాపారంలో స్థిరపడి ఆర్థికంగా ఎదిగాడు. ఆ సంపాదనతో బంగారంపై మక్కువ పెంచుకుని దాదాపు 3.5 కిలోల బంగారం ఒంటి మీద ధరిస్తూ తిరగడం మొదలుపెట్టాడు. అదే అతని సమస్యకు కారణమైంది.
తాజాగా అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా గ్యాంగ్ నుంచి అతనికి బెదిరింపులు వచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. మొదట వరుసగా మిస్డ్ కాల్స్, ఆ తర్వాత వాట్సాప్ కాల్స్ వచ్చాయి. స్పందించకపోవడంతో నేరుగా ఒక ఆడియో మెసేజ్ పంపించారు. అందులో ఏకంగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే బంగారం వేసుకునే స్థితిలో కూడా నువ్వు ఉండవు అంటూ స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు.
“ఈ విషయం బయటకు చెప్పొద్దు… సైలెంట్‌గా సెటిల్ చేసుకో” అని ఆ ఆడియోలో మరో హెచ్చరిక కూడా ఉంది. దీంతో భయాందోళనకు గురైన కన్హయ్యలాల్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
రోహిత్ గోదారా సాధారణ గ్యాంగ్ సభ్యుడు కాదని అధికారులు చెబుతున్నారు. పంజాబ్ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులో కీలక నిందితులలో ఒకడు. ప్రస్తుతం కెనడాలో తలదాచుకుని ఉండి, అక్కడి నుంచి ఇండియాలో వసూళ్ల ముఠాలను నడిపిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కన్హయ్యలాల్‌కు వచ్చిన బెదిరింపు కాల్ కూడా అదే ముఠా పని కావచ్చని భావిస్తున్నారు.
5 కోట్ల రూపాయల డిమాండ్ చిన్న విషయం కాదు. భారీ బంగారం ధరించడమే ఈ బెదిరింపులకు మూలంగా మారడంతో, పోలీసులు దీనిని అత్యంత సీరియస్‌గా తీసుకుని, గోదారా గ్యాంగ్ లింకులను ఖచ్చితంగా చెక్కుదామని నిర్ణయించారు. ప్రస్తుతం బాధితుడికి భద్రత కూడా కల్పించారు.



