ఫుట్‌బాల్ ప్రేమికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘గోట్ ఇండియా టూర్ 2025’ చివరకు సమీపించింది. అర్జెంటీనా లెజెండ్, ప్రపంచ ఫుట్‌బాల్‌కి కొత్త నిర్వచనం ఇచ్చిన లియోనెల్ మెస్సీ మూడు రోజుల ప్రత్యేక పర్యటన కోసం భారత్‌కు చేరుతున్నారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఆయన కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ వంటి కీలక నగరాల్లో పర్యటించనున్నారు. టూర్ సందర్భంగా పలువురు ప్రముఖులతో సమావేశాలు, అభిమానులతో ప్రత్యేక ఇంటరాక్షన్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లో ప్రత్యేక వేడుకలు…
13న కోల్‌కతా టూర్ పూర్తి చేసుకున్న మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 7v7 ఫుట్‌బాల్ మ్యాచ్లో పాల్గొననున్నారు. మ్యాచ్ అనంతరం మెస్సీ గౌరవార్థం ప్రత్యేక సంగీత విభావరి కూడా నిర్వహించబడనుంది.
ఇతర నగరాల్లో మెస్సీ షెడ్యూల్ ఇలా…
పర్యటనలో భాగంగా కోల్‌కతాలో ఆయన సీఎం మమతా బెనర్జీ, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌లతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. టూర్ ప్రమోటర్ శతద్రు దత్తా వెల్లడించిన వివరాల ప్రకారం, ముంబైలో జరిగే ఈవెంట్లకు మెస్సీతో పాటు అతని సన్నిహిత సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా రానున్నారు. అక్కడ సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్, చారిటీ ఫ్యాషన్ షో మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. చివరి రోజు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మెస్సీ భేటీ కానున్నట్లు సమాచారం.
‘డిస్ట్రిక్ట్ యాప్’ ద్వారా ఈ టూర్‌కి సంబంధించిన టికెట్లు విక్రయిస్తున్నారు. చాలా నగరాల్లో టికెట్ ధర రూ. 4,500 నుంచి ప్రారంభమవుతుండగా, ముంబైలో మాత్రం ప్రారంభ ధర రూ. 8,250. 2011లో అర్జెంటీనా తరఫున ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా కోల్‌కతాకు వచ్చిన తర్వాత మెస్సీ మళ్లీ భారత్ నేలను తాకడం ఇదే తొలిసారి కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
మెస్సీ 13న హైదరాబాద్‌లో…
◆ రాత్రి 7:00 గంటలకు: రాజీవ్ గాంధీ స్టేడియంలో 7v7 మ్యాచ్ — మెస్సీ Vs తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
◆ అనంతరం ప్రత్యేక సంగీత కచేరీ



