ఘజియాబాద్‌లో దారుణం: హైరైజ్ అపార్ట్‌మెంట్ నుంచి దూకి ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 16, 14, 12 ఏళ్ల ముగ్గురు అక్కాచెల్లెళ్లు తొమ్మిదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తొలుత ఈ ఘటనను ‘కొరియన్ ఆన్‌లైన్ గేమ్ టాస్క్’తో అనుసంధానిస్తూ తండ్రి చేసిన ప్రచారం పోలీసుల విచారణలో అసత్యమని తేలింది. దర్యాప్తులో మరింత భయంకరమైన కుటుంబ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

స్టాక్ ట్రేడర్‌గా పనిచేస్తున్న చేతన్ కుమార్‌కు ఇద్దరు భార్యలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు తీవ్ర అప్పుల భారంతో కుంగిపోయి ఉండగా, సుమారు రూ. 2 కోట్ల వరకు బాకీ ఉన్నట్లు తేలింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యుత్ బిల్లు చెల్లించేందుకు కూడా కూతుళ్ల మొబైల్ ఫోన్లను అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారి తర్వాత బాలికలను స్కూల్‌కు పంపడం మానేసిన తండ్రి, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తానంటూ వారిని బెదిరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఆ ముగ్గురు బాలికలు తల్లిదండ్రుల ఫోన్లలో తరచుగా కొరియన్ డ్రామాలు చూసేవారని, ఆ ప్రభావంతో తమ పేర్లను కూడా కొరియన్ పేర్లుగా మార్చుకుని మొబైల్ వాల్‌పేపర్‌లపై రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారం రోజుల క్రితం తండ్రి తన ఫోన్ ఇవ్వడానికి నిరాకరించడం, పిల్లలను అవమానించేలా ప్రవర్తించడం వంటి ఘటనలు వారి సున్నిత మనసులపై తీవ్ర ప్రభావం చూపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పక్కింటి నివాసి అరుణ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో పెద్ద అక్క బాల్కనీ అంచుకు వెళ్లగా, మిగిలిన ఇద్దరు చెల్లెళ్లు ఆమెను వెనక్కి లాగేందుకు ప్రయత్నించారు. అయితే క్షణాల్లోనే ముగ్గురూ ఒకరినొకరు పట్టుకుని కిందకు దూకేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా, గది మధ్యలో కుటుంబ సభ్యుల ఫోటోలు వృత్తాకారంలో అమర్చిన దృశ్యం కనిపించింది. అలాగే ఒక డైరీలో “ఇదంతా నిజం… కచ్చితంగా చదవండి” అంటూ తల్లిదండ్రులను ఉద్దేశించి రాసిన సందేశం, కొన్ని సినిమా డైలాగులు కూడా లభించాయి.

ఈ ఘటన 2017లో దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘బ్లూ వేల్’ సవాల్‌ను గుర్తుకు తెచ్చినప్పటికీ, ప్రాథమిక విచారణలో ఆన్‌లైన్ గేమ్‌కు ప్రత్యక్ష సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, కుటుంబ ఒత్తిళ్లు, అతిగా పెరిగిన మొబైల్ అడిక్షన్ కలిసి ఈ ముగ్గురు బాలికలను మృత్యువు వైపు నడిపించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి