ఘట్ కేసర్‌లో 72 అంతస్తుల భవనం: హైదరాబాద్‌లో దక్షిణాసియాలో అత్యంత ఎత్తైన నిర్మాణం

హైదరాబాద్ నగరంలో మరో అద్భుత చిహ్నం త్వరలోనే రాగలదని వార్త. ఘట్ కేసర్‌లో 72 అంతస్తుల భారీ భవనం నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇది కేవలం హైదరాబాద్‌లోనే కాదు, దక్షిణాసియాలో అత్యంత ఎత్తయిన భవనంగా గుర్తింపు పొందనుంది. ఈ భవనం ప్రత్యేకత ఏంటంటే, ప్రతి 30 అంతస్తులకు నిర్మాణ శైలి పూర్తిగా మారిపోతుంది. భవనం డిజైన్‌లో ఒంపులు, మెలికలు లాంటి ఆకారాలు ఉంటాయి, వీటివల్ల భవనం చూస్తున్న వారికి వినోదం, కొత్త అనుభూతి కలిగిస్తుందని సమాచారం.

ఈ భవనం నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్ అనుమతులు ఇప్పటికే అగ్నిమాపక శాఖకు సమర్పించబడ్డాయని ఫైర్ & డిజాస్టర్ రెస్పాన్స్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ వెల్లడించారు. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ఘట్ కేసర్ భవనం దక్షిణాసియాలోనే అత్యంత ఎత్తయిన భవనంగా నిలవనుందని ఆయన వివరించారు.

హైదరాబాద్ మహానగరం రోజు రోజుకీ అభివృద్ధి దిశగా క్రమంగా అడుగులు వేస్తోంది. విశాలమైన రహదారులు, ఆకాశాన్ని తాకే ఎత్తయిన భవనాలు నగరానికి కొత్త రూపం ఇస్తున్నాయి. గతంలో ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ కోల్డ్ వెల్ బ్యాంకర్ రిచర్డ్ ఎల్లిస్ (సీబీఆర్‌ఈ) ఏషియన్ ప్రైవేట్ లిమిటెడ్ చేసిన అధ్యయనంలో, దేశంలో ఎత్తయిన భవనాల పరంగా హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించబడింది.

ఘట్ కేసర్‌లో నిర్మాణం కాబోయే ఈ భవనం, భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగంలో భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాన్సింగ్ డెఫోడైల్ థీమ్‌తో రూపొందించబడే భవనం, ప్రతి 30 అంతస్తులకు ప్రత్యేక ఆకృతులు కలిగి ఉండటం వలన, దూరం నుంచి చూస్తే గాలిలో మెలికలు తిరుగుతున్నట్టే అనిపించేలా రూపకల్పన చేయబడుతుంది.

హైదరాబాద్ విశ్వనగరంగా, ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో, రాబోయే రోజుల్లో ఇలాంటి భారీ, సాంకేతికత ఆధారిత ప్రాజెక్టులు మరింతగా నగరంలో కనబడే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి