జెన్‌జెడ్ యువతలో మద్యం అలవాటు తగ్గుదల – ఆరోగ్య చైతన్యంతో మారుతున్న జీవనశైలి

ప్రపంచవ్యాప్తంగా యువత, ముఖ్యంగా జెన్-జెడ్ తరం జీవనశైలిలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంటోంది. మద్యం తాగే అలవాటు తగ్గుముఖం పట్టింది. చట్టబద్ధ వయసు కలిగిన ప్రతీ ముగ్గురిలో ఒకరు (36 శాతం) ఇప్పటివరకు మద్యం రుచి చూడలేదని యూరోమానిటర్ ఇంటర్నేషనల్ విడుదల చేసిన తాజా గ్లోబల్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ నివేదిక యువత ఆలోచనల్లో చోటుచేసుకుంటున్న కొత్త దిశను స్పష్టంగా చూపిస్తోంది.

మద్యం నుండి దూరంగా ఉండటానికి యువత చూపుతున్న ప్రధాన కారణం — ఆరోగ్యంపై అవగాహన. ఆరోగ్యంగా ఉండటం, దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం అనే ఉద్దేశ్యంతోనే 87 శాతం మంది ఆల్కహాల్‌కి దూరంగా ఉంటున్నారని సర్వే తెలిపింది. అదనంగా, డబ్బు ఆదా చేయడం (30 శాతం), నిద్ర నాణ్యతను మెరుగుపరచడం (25 శాతం) వంటి కారణాలు కూడా మద్యపానం తగ్గడానికి దోహదపడ్డాయి.

గత ఐదేళ్లలో మద్యపానం చేసే వారి సంఖ్యలో కూడా స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. 2020లో వారానికి కనీసం ఒకసారి అయినా మద్యం తాగేవారు 23 శాతం ఉండగా, 2025 నాటికి అది 17 శాతానికి పడిపోయింది. ఇక మద్యం తాగే వారిలో సగానికి పైగా (53 శాతం) దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఇది 44 శాతం మాత్రమే.

ప్రస్తుతం యువతలో ‘జీబ్రా స్ట్రైపింగ్’ అనే కొత్త ట్రెండ్‌ ప్రాచుర్యం పొందుతోంది. స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు ఒకసారి ఆల్కహాలిక్ డ్రింక్, మరొకసారి నాన్-ఆల్కహాలిక్ డ్రింక్ తీసుకోవడాన్ని ఈ పద్ధతి అంటారు. ఈ విధానం ద్వారా వారు మద్యం వినియోగాన్ని సమతుల్యంగా ఉంచుతున్నారు.

అయితే, ప్రపంచ వ్యాప్త ఈ తగ్గుదల ట్రెండ్‌కి భిన్నంగా భారతదేశంలో మాత్రం మద్యం వినియోగం పెరుగుతున్నది. 2024–2029 మధ్యకాలంలో భారతదేశంలో ఆల్కహాలిక్ డ్రింక్స్ వినియోగం 357 మిలియన్ లీటర్ల వరకు పెరుగుతుందని, ఇది ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి అని నివేదిక పేర్కొంది.

ఇక మరోవైపు, నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. 2024లో ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ కేవలం 0.6 శాతం వృద్ధి చెంది 1.7 ట్రిలియన్ డాలర్లకు చేరగా, నాన్-ఆల్కహాలిక్ స్పిరిట్స్ 17 శాతం, నాన్-ఆల్కహాలిక్ బీర్ 11 శాతం, నాన్-ఆల్కహాలిక్ వైన్ 7 శాతం వృద్ధి సాధించాయి. రాబోయే ఐదేళ్లలో (2025–2029) ఈ మార్కెట్ మరో 24 శాతం పెరుగుతుందని అంచనా.


Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి