పెళ్లి కాకుండానే తల్లి కావాల్సి వచ్చిన ఓ యువతి.. సమాజం ఏమంటుందోనన్న భయంతో పుట్టిన మూడో రోజుకే తన మగబిడ్డను అనాథాశ్రమంలో వదిలేసింది. ఆ పసికందుకు అక్కడ పనిచేసే ఓ నర్సు పేరు పెట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఓ విదేశీ దంపతులు ఆ శిశువును దత్తత తీసుకుని నెదర్లాండ్స్‌కు వెళ్లిపోయారు. అక్కడే పెరిగి, చదువుకుని, రాజకీయాల్లోకి అడుగుపెట్టి చివరకు ఒక నగరానికి మేయర్‌గా ఎన్నికయ్యాడు ఆ బాలుడు.
అయితే పదవి, ప్రతిష్ఠ, కుటుంబం అన్నీ ఉన్నా… చిన్ననాటి నుంచి అతని మనసులో ఓ ప్రశ్న మిగిలిపోయింది. ‘నన్ను కన్న తల్లి ఎవరు? ఆమె ఇప్పుడు ఎలా ఉంటారు?’ అనే ఆరాటం అతన్ని ఎన్నో ఏళ్లుగా వెంటాడుతోంది. ఆ తల్లిని ఒక్కసారి అయినా కలవాలనే తపనతో అతడు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు మూడుసార్లు వచ్చాడు. రెండుసార్లు వెతికినా తల్లి జాడ దొరకలేదు. కానీ ఈసారి—తనకు చిన్నతనంలో పేరు పెట్టిన నర్సు ఆచూకీ దొరకడంతో—తల్లి వరకు చేరే దారి తెరుచుకున్నట్టుగా అతడు ఆశతో ఉన్నాడు.
ఈ కథ నెదర్లాండ్స్‌లోని హీమ్‌స్టెడ్ నగర మేయర్ ఫాల్గుణ్ బిన్నెండిజ్క్‌ది. వినడానికి సినిమా కథలా అనిపించే ఈ జీవితం… వాస్తవంలో కన్నీళ్లతో నిండిన సత్యం.
1985 ఫిబ్రవరి 10న నాగ్‌పూర్‌లో జన్మించిన ఫాల్గుణ్‌ను, అప్పటికి కేవలం 21 ఏళ్ల వయసున్న అతని తల్లి, సామాజిక ఒత్తిళ్లను తట్టుకోలేక మూడో రోజుకే నాగ్‌పూర్‌లోని ‘మాతృ సేవా సంఘ్’లో వదిలేసి వెళ్లిపోయింది. పెళ్లి కాకుండానే తల్లి కావాల్సి రావడం అప్పటి పరిస్థితుల్లో ఆమెకు భరించలేని భారంగా మారింది.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలో (ఫిబ్రవరి) జన్మించిన ఆ శిశువుకు అక్కడ పనిచేసే నర్సు ‘ఫాల్గుణ్’ అని పేరు పెట్టింది. కొద్ది వారాల తర్వాత ఒక డచ్ దంపతులు అతడిని దత్తత తీసుకుని నెదర్లాండ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడే అతని బాల్యం, విద్యాభ్యాసం కొనసాగింది. క్రమంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఫాల్గుణ్… ప్రజల విశ్వాసం గెలుచుకుని హీమ్‌స్టెడ్ నగర మేయర్‌గా ఎన్నికయ్యాడు.
అయితే ఈ విజయం మధ్యেও అతని మనసులో ఓ వెలితి మిగిలింది. తన మూలాలు తెలుసుకోవాలనే తపన అతన్ని పదేపదే భారత్ వైపు లాగింది. 2006లో తొలిసారి పర్యాటకుడిగా భారత్‌కు వచ్చినప్పుడు, తనను చూసి చాలా మంది హిందీలో మాట్లాడటం చూసి తన మూలాలపై ఆసక్తి మరింత పెరిగింది.
2017లో రెండోసారి నాగ్‌పూర్ వచ్చి ‘మాతృ సేవా సంఘ్’ రికార్డులను పరిశీలించాడు. అందులో తల్లి పేరు మాత్రమే దొరికింది. కానీ చిరునామా లేకపోవడంతో ఆమెను వెతకడం అసాధ్యంగా మారింది.
ఇక తాజాగా 2025 డిసెంబర్‌లో తన భార్య, నలుగురు పిల్లలతో కలిసి మూడోసారి నాగ్‌పూర్‌కు వచ్చిన ఫాల్గుణ్ జీవితంలో ఒక అనూహ్య మలుపు చోటు చేసుకుంది. నాగ్‌పూర్ జిల్లా యంత్రాంగం సహకారంతో—40 ఏళ్ల క్రితం మాతృ సేవా సంఘ్‌లో పనిచేసిన ఓ రిటైర్డ్ నర్సు ఆచూకీ లభించింది. ఆమెను కలిసిన క్షణంలోనే… ఆ నర్సు ఫాల్గుణ్‌ను గుర్తుపట్టి, ‘నీకే నేను పేరు పెట్టాను’ అని చెప్పింది. ఆ మాటలతో ఇద్దరూ భావోద్వేగానికి లోనై కన్నీళ్లతో మునిగిపోయారు.
“నా జీవితానికి గుర్తింపునిచ్చిన వ్యక్తిని 40 ఏళ్ల తర్వాత కలవడం… ఇది నా జీవితంలో మరిచిపోలేని క్షణం” అని ఫాల్గుణ్ చెప్పారు.
కర్ణుడు – కుంతి స్ఫూర్తి…
మహాభారతంలోని కర్ణుడి పాత్ర తనకు అత్యంత ఇష్టమని ఫాల్గుణ్ చెప్పుకొస్తారు. “ప్రతి కర్ణుడికీ తన కుంతిని కలిసే హక్కు ఉంటుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. తనను పుట్టగానే వదిలేసినందుకు, తన తల్లి ఇప్పటికీ తప్పుచేశాననే భావనతో బాధపడుతూ ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు.
“ఆమెను కలిసినప్పుడు… నేను బాగున్నానని, నాకు ప్రేమతో పెంచిన కుటుంబం దొరికిందని చెప్పాలనుకుంటున్నాను. అంతే” అంటూ ఫాల్గుణ్ భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ అభినవ కర్ణుడు… తన కుంతిని కలుసుకునే రోజు త్వరలోనే రావాలని, అతని కోరిక నెరవేరాలని మనమంతా హృదయపూర్వకంగా ఆశిద్దాం.



