విలేకరులు కావలెను ప్రకటనల ముసుగు వెనుక దాగిన మోసం – జర్నలిజంలో పెరుగుతున్న నకిలీ విలేకరుల హవా

జర్నలిజం అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు — ఇది సమాజానికి అద్దం పట్టే పవిత్ర రంగం. ప్రజల కష్టాలు, నిజాలు, వాస్తవాలు వెలుగులోకి తెచ్చే ధర్మపరమైన బాధ్యత ఈ వృత్తికి ఉంది. కానీ నేటి పరిస్థితుల్లో ఆ పవిత్ర రంగం భ్రష్టుపట్టడం విచారకరం. నిజమైన విలువలను కాపాడే జర్నలిస్టులు కూడా కొందరి అక్రమ చర్యల కారణంగా తలదించుకునే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటి జర్నలిజంలో కొందరు నైతిక విలువలు విస్మరించి “అక్రమాలనే సక్రమాలుగా” మార్చేసిన దుస్థితి నెలకొంది. సామాజిక బాధ్యత అనే పేరుతో మీడియా రంగంలోకి ప్రవేశించి దోపిడీ, మోసాలకు పాల్పడే శక్తులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. యువతలో ఉత్సాహం, ఆశక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఈ రంగంపై ఆకర్షితులు అవుతున్నారు. కానీ జర్నలిజం అంటే ఏమిటో, దాని పునాది ఏమిటో తెలుసుకోకుండానే కొందరు ఈ వృత్తిలోకి అడుగు పెడుతున్నారు.

“విలేకరులు కావలెను” — ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిన ప్రకటన!

గత కొన్నేళ్లుగా “విలేకరులు కావలెను” అనే మాట ముసుగులో జర్నలిజం రంగంలోకి మోసగాళ్లు, అక్రమార్కులు ప్రవేశిస్తున్నారు. సోషల్ మీడియా విస్తరించాక ప్రతి ఒక్కరూ పేపర్, యూట్యూబ్ ఛానల్ పేరుతో మీడియా ప్రారంభిస్తున్నారు. నిజమైన అనుభవం లేకుండా, సర్టిఫికేట్లు లేకుండా, కేవలం డబ్బు కోసం నకిలీ పత్రికలు, నకిలీ ఐడీ కార్డులు తయారు చేస్తున్నారు.

ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పడిన తరువాత, ఈ నకిలీ జర్నలిస్టుల హవా పెరిగిపోయింది. కొందరు ప్రక్క రాష్ట్రాల పత్రికల పేరుతో ఇక్కడ “ఏరియా వారీగా” మీడియా ఆఫీసులు ఏర్పాటు చేసి, యాడ్స్ పేరుతో దోపిడీ చేస్తున్నారు. విజయవాడ–గుంటూరు ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది.

యువతకు హెచ్చరిక — ఈ ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దు!

“విలేకరులు కావలెను” అనే ప్రకటనల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోకుండా అనేకమంది యువకులు జీవితాలను పణంగా పెడుతున్నారు. ఈ ప్రకటనల్లో ఎక్కడా పని స్వరూపం, జీతం, బాధ్యతలు, అర్హతలు వంటి వివరాలు ఇవ్వరు. కానీ కలర్ ఫుల్ యాడ్ చూసి అనేకమంది ఆకర్షితులు అవుతున్నారు. ఆ తర్వాతే తెలుస్తుంది — ఐడీ కార్డులు ఇవ్వడానికి, హోదాలు కల్పించడానికి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని.

ఈ నకిలీ పత్రికల యజమానులు “స్టేట్ బ్యూరో చీఫ్”, “రీజనల్ కోఆర్డినేటర్”, “సీఈఓ” పేర్లతో హోదాలు ఇచ్చి మోసగిస్తున్నారు. ఆ ఐడీ కార్డులు చేతబట్టి ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో తలదూర్చుతున్నారు. ఫలితంగా నిజమైన మీడియా ప్రతినిధులకే అనుమాన దృష్టి ఎదురవుతోంది.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది!

ప్రభుత్వం, పోలీస్ విభాగం ఈ విషయంపై వెంటనే దృష్టి సారించాలి. “విలేకరులు కావలెను” అనే ప్రకటనలను చట్టబద్ధంగా నియంత్రించే విధానం తప్పనిసరి చేయాలి. ఒక ప్రకటన నిజమైనదా, కాదా అనే విషయంపై పరిశీలన తర్వాతే ప్రచురణకు అనుమతించాలి.

ఈ ప్రకటనల్లో ఉద్యోగ పేరు, విద్యార్హత, జీతం, టీఏ–డీఏ, ఇతర సౌకర్యాలు వంటి వివరాలు తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే అది ఫ్రాడ్ యాడ్‌గా పరిగణించి చర్యలు తీసుకోవాలి.

జర్నలిజం — వ్యాపారం కాదు, బాధ్యత

గతంలో జర్నలిజం సమాజానికి అద్దం పట్టే వృత్తి. కానీ ఇప్పుడు కొందరి చేతుల్లో అది వ్యాపారమైపోయింది. నకిలీ జర్నలిస్టులు సామాజిక బాధ్యత పేరుతో దోపిడీ చేస్తున్నారు. “జర్నలిజం వృత్తి కాదు, సామాజిక బాధ్యత” అని చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు.

అందుకే ఈ సందేశం ప్రతి యువ జర్నలిస్టుకు ఒక హెచ్చరిక —
విలేకరులు కావలెను” అనే ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దు. నిజమైన జర్నలిజం అంటే సమాజానికి సేవ చేయడం, న్యాయం కోసం నిలబడటం. దోపిడీకి మార్గం చూపే మోసగాళ్లకు దూరంగా ఉండండి.

జర్నలిజం పట్ల ఆసక్తి ఉంటే, విలువలతో, నైతికతతో ముందుకు సాగండి. ఎందుకంటే నిజమైన జర్నలిస్ట్ అనేది ఒక హోదా కాదు — ఒక బాధ్యత.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి