పాలుగారే పసివాడు. వయసు కేవలం ఎనిమిదేళ్లు. జీవితాన్ని ఇంకా అర్థం చేసుకునే లోపే అతడిపై విధి పిడుగు పడింది. తండ్రి ఇప్పటికే హెచ్‌ఐవీ కారణంగా మరణించాడు. తాజాగా అదే వ్యాధితో తల్లి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఆ విషాద ఘడియల్లో అతడిని ఓదార్చే వారు, ‘మేమున్నాం’ అంటూ అక్కున చేర్చుకునే వారు ఒక్కరైనా ముందుకు రాలేదు. హెచ్‌ఐవీ భయమే కారణమేమో కానీ, తల్లి తరఫు బంధువులెవరూ కూడా ఆస్పత్రి ముఖం చూడలేదు.
కన్నీళ్లను దిగమింగుకుని, భయంతోనూ బాధతోనూ వణుకుతూ, పోస్టుమార్టం గది వరకూ తల్లి మృతదేహం వెంట ఆ బాలుడు ఒంటరిగా నడిచాడు. ఆ తర్వాత తల్లి ఎడబాటును తట్టుకోలేక గుండెలవిసేలా రోదించాడు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాలునికి ధైర్యం చెప్పి, చట్టపరమైన అన్ని ప్రక్రియలను దగ్గరుండి పూర్తి చేయడమే కాకుండా, అంత్యక్రియల వరకూ అతనికి తోడుగా నిలిచారు.
అన్నీ తామైన పోలీసులు
హెచ్‌ఐవీ చికిత్స నిమిత్తం బాలుని తల్లి రెండు నెలల క్రితం అత్తగారింటికి వెళ్లింది. వ్యాధి ముదిరిపోవడంతో నెల రోజులుగా తీవ్ర వేదన అనుభవించింది. ఐదు రోజుల క్రితం కొడుకుతో కలిసి తల్లిగారి ఇంటికి చేరింది. పరిస్థితి విషమించడంతో రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరగా, గురువారం చికిత్స పొందుతూ మరణించింది.
పోస్టుమార్టం గది ముందు ఒంటరిగా కూర్చున్న బాలుడిని చూసిన పోలీసులు ఆరా తీయగా, తన దయనీయ స్థితిని వివరించాడు. తనకు ఎవరూ లేరని, బంధువులు ఆస్పత్రికీ రాలేదని, వారి ఫోన్ నంబర్లు కూడా తన వద్ద లేవని చెప్పాడు. దాంతో పోలీసులు స్వయంగా ప్రయత్నించి మృతురాలి తండ్రి, అత్తమామలకు సమాచారం అందించారు.
అనంతరం వారి సమక్షంలో అంత్యక్రియలను కూడా పోలీసులు తామే నిర్వహించారు. బాలుడు నిరుపేద కుటుంబానికి చెందినవాడని ఇన్‌స్పెక్టర్ రితేశ్ ఠాకూర్ తెలిపారు. ‘‘భూ తగాదాల కారణంగా పెదనాన్న, చిన్నాన్నల నుంచి తనకు ముప్పు ఉందని బాలుడు చెప్పాడు. అయితే విచారణలో అలాంటిదేమీ లేదని తేలింది. వారు ఢిల్లీలో నివసిస్తున్నారు. తల్లి మరణం విషయం తెలిసిన తర్వాతే ఊరికి వచ్చారు’’ అని వివరించారు.
బాలునికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించినట్లు ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే అతడికి వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్ధారణ అవుతుందని చెప్పారు.



