EPFO News: పీఎఫ్ గరిష్ట వేతన పరిమితిపై సుప్రీంకోర్టు ఆదేశాలు.. 4 నెలల్లో కేంద్రం నిర్ణయం

ఈపీఎఫ్‌వో (EPFO) విషయంలో ఉద్యోగులకు లాభం చేకూరే కీలక పరిణామం చోటుచేసుకుంది. పీఎఫ్ గరిష్ట వేతన పరిమితిని సవరించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నాలుగు నెలల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని డెడ్‌లైన్ విధించింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల వల్ల చిరుద్యోగులు పీఎఫ్ ప్రయోజనాలు పొందలేకపోతుండటాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

ప్రస్తుతం పీఎఫ్ నిబంధనలు ఏంటి?

ఇప్పటివరకు పీఎఫ్ గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలుగా కొనసాగుతోంది. బేసిక్ పే రూ.15 వేలలోపు ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా ఈపీఎఫ్‌కు కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. అయితే రూ.15 వేలకుపైగా బేసిక్ శాలరీ ఉన్నవారికి ఇది ఐచ్ఛికంగా మాత్రమే ఉంది. ఈ కారణంగా అధిక సంఖ్యలో ఉద్యోగులు పీఎఫ్ ప్రయోజనాలకు దూరమవుతున్నారు.

11 ఏళ్లుగా మార్పులు లేకపోవడంపై సుప్రీం అసంతృప్తి

గత 11 ఏళ్లుగా పీఎఫ్ గరిష్ట వేతన పరిమితిలో ఎలాంటి మార్పులు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ.15 వేల పరిమితి వల్ల చిన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్యానించింది. ఈ పరిమితి కారణంగా వారికి సరైన ఆర్థిక భద్రత లేకుండా పోతుందని పేర్కొంది.

పిటిషన్ నేపథ్యం

సామాజిక కార్యకర్త నవీన్ ప్రకాశ్ నౌటియాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీఎఫ్ గరిష్ట వేతన పరిమితి పెంచకపోవడం వల్ల చిరుద్యోగులు పీఎఫ్ పథకానికి దూరమవుతున్నారని, ఇది అన్యాయమని పిటిషన్‌లో వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్రానికి నాలుగు నెలల గడువు ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

రూ.30 వేల వరకు పెంపు?

తాజా పరిణామాల నేపథ్యంలో పీఎఫ్ గరిష్ట వేతన పరిమితిని రూ.30 వేల వరకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. గతంలో 2014లో గరిష్ట వేతన పరిమితిని రూ.6 వేల నుంచి రూ.15 వేలకు పెంచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సవరణలు జరగలేదు.

ఉద్యోగుల్లో ఆశలు

ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో పీఎఫ్ పరిమితిని పెంచాలని ఉద్యోగ సంఘాలు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం కదిలే అవకాశముందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల్లో తీసుకునే నిర్ణయం కోట్లాది ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి