ఏలూరులో జరిగిన నేర సంఘటన తీవ్రంగా కలచివేసింది. ఇద్దరు రౌడీ షీటర్లు పథకం ప్రకారం ముందుకు వచ్చి, ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై దాడి చేసి, కిడ్నాప్ చేసి, ప్రభుత్వ కార్యాలయమైన గ్రామ సచివాలయంలోనే అత్యాచారానికి పాల్పడటం స్థానిక ప్రజల్లో ఆగ్రహంతో పాటు భద్రతాపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన బాధిత యువతి ఏలూరు టూటౌన్ ప్రాంతంలో స్నేహితురాలి ఇంటిలో ఉంటోంది. ఆ స్నేహితురాలి కుటుంబ సభ్యులు తిరుపతి వెళ్లిన విషయాన్ని స్థానిక రౌడీ షీటర్లు పులిగడ్డ జగదీశ్ బాబు, లావేటి భవాని కుమార్ ముందుగానే గమనించారు. ఇంట్లో ఎవ్వరూ లేరనే పరిస్థితిని ఆసరాగా చేసుకున్న వారు అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటిపై దాడి చేశారు. తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడిన వారు, యువతిని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు.
ఆ తర్వాత నిందితుడు జగదీశ్ బాబు, సమీపంలోని గ్రామ సచివాలయంలోకి యువతిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని ప్రాణహాని హెచ్చరికలు చేసి వదిలారు. తీవ్ర మానసిక షాక్‌కు గురైన బాధితురాలు చివరకు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రభుత్వ కార్యాలయాన్ని నేర స్థలంగా మార్చడమే కాకుండా, రౌడీ షీటర్లు ఇంతవరకు బరితెగించి ఈ రకమైన అఘాయిత్యానికి పాల్పడటం పట్ల ఏలూరు అంతటా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజా భద్రతపై ప్రశ్నలు మరోసారి ముందుకు వచ్చాయి.



