విలాసవంతమైన నిర్మాణాలు, విలువైన ఆభరణాలు, ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ముందంజలో ఉండే దుబాయ్ మరోసారి ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకుంది. ప్రపంచంలోనే అత్యంత బరువైన బంగారు వస్త్రాన్ని (Gold Dress) రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. 10.5 కిలోల బరువున్న ఈ బంగారు డ్రెస్ విలువ ఏకంగా 10.88 లక్షల అమెరికన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు ₹9.5 కోట్లు.
ఈ అద్భుత కళాఖండాన్ని సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ ‘అల్ రొమైజాన్ గోల్డ్’ (Al Romaizan Gold) రూపొందించింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారైన ఈ డ్రెస్‌లో వజ్రాలు, కెంపులు, పచ్చలు, రత్నాలను అద్భుతంగా పొదిగారు. మధ్యప్రాచ్య సంప్రదాయ కళానైపుణ్యాన్ని ప్రతిబింబించేలా సంపద, అందం, సాధికారతను సూచించే ప్రతీ డిజైన్ భాగం అత్యద్భుతంగా తీర్చిదిద్దబడింది. ఈ డ్రెస్ కేవలం ఒక దుస్త్రంలా కాకుండా, ధరించగలిగే కళాఖండంలా ఆకట్టుకుంటోంది.
డ్రెస్‌లో ఉన్న విలువైన భాగాలు
ఈ బంగారు డ్రెస్ మొత్తం నాలుగు ప్రధాన భాగాలుగా రూపొందించబడింది:
- కిరీటం (Tiara): 398 గ్రాములు
- నెక్లెస్: 8,810.60 గ్రాములు
- చెవిపోగులు: 134.1 గ్రాములు
- నడుము ఆభరణం (Heer): 738.5 గ్రాములు
ఈ మొత్తం కలిపి 10.5 కిలోల బరువుతో బంగారు డ్రెస్ ప్రపంచంలోనే అగ్రస్థానం పొందింది.
గిన్నిస్ గుర్తింపు
ఈ అద్భుత బంగారు డ్రెస్‌ను ఇటీవల షార్జాలో జరిగిన 56వ మిడిల్ ఈస్ట్ వాచ్ అండ్ జ్యువెలరీ షోలో ప్రదర్శించారు. అక్కడే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు దీనిని అధికారికంగా ప్రపంచంలోనే అత్యంత బరువైన బంగారు వస్త్రంగా గుర్తించారు.
భవిష్యత్ ప్రదర్శనలు
తయారీదారులు ఈ బంగారు డ్రెస్‌ను విక్రయించబోమని స్పష్టం చేశారు. ఇది వాణిజ్య ఉత్పత్తి కాదని, ప్రపంచానికి “ధరించగలిగే కళ” అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేయడం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ఈ కళాఖండాన్ని త్వరలో యూరప్, ఆసియాలోని ప్రముఖ ఫ్యాషన్ మరియు ఆభరణాల ప్రదర్శనల్లో ప్రదర్శించనున్నారు.



