99 ఏళ్ల డాక్టర్ లక్ష్మీబాయి రూ.3.4 కోట్ల విరాళం: క్యాన్సర్ బాధితులకు గొప్ప సహాయం

క్యాన్సర్‌తో బాధపడే మహిళల ఇబ్బందులు తన సేవా కాలంలో అనేకసార్లు గమనించిన ఒడిశాకు చెందిన రిటైర్డ్ గైనకాలజిస్ట్ డాక్టర్ కే లక్ష్మీబాయి మరోసారి తన మహోన్నత మనసును చాటుకున్నారు. 99వ ఏట అడుగుపెట్టే ముందు భువనేశ్వర్ ఎయిమ్స్‌కు రూ.3.40 కోట్ల భారీ విరాళం ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

పేద మహిళలకు ఆధునిక చికిత్సే లక్ష్యం

ఆసుపత్రుల్లో సరైన చికిత్స లేక అనేక మహిళలు ప్రాణాలు కోల్పోతూ చూసిన కష్టం ఆమెను ఈ నిర్ణయానికి దారి తీసింది. ఈ విరాళాన్ని గైనకాలజిక్ ఆంకాలజీ విభాగాన్ని బలోపేతం చేయడానికి, ప్రత్యేక చికిత్స అందించడానికి వినియోగించనున్నారు. అదనంగా, బాలికల్లో క్యాన్సర్ నిరోధక అవగాహన, టీకా డ్రైవ్‌ల కోసం మరో రూ.3 లక్షలు బెర్హంపూర్ ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీకి అందించారు.

వైద్య సేవలో ఆమె ప్రయాణం

1926లో జన్మించిన ఆమె SCB మెడికల్ కాలేజీలో తొలి ఎంబీబీఎస్ బ్యాచ్‌లో చేరారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎండీ పూర్తిచేసి 1950లో ప్రభుత్వ సేవ ప్రారంభించారు. బెర్హంపూర్‌లోని MKCG మెడికల్ కాలేజీ సహా పలు ఆసుపత్రుల్లో పనిచేసి 1986లో రిటైర్ అయ్యారు.

డాక్టర్ లక్ష్మీబాయి ఈ సహాయం భవిష్యత్తులో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆశావహంగా మారుతుందని ఎయిమ్స్ భువనేశ్వర్ అధికారులు అభినందించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి