టాలీవుడ్ యాక్టర్లతో డాన్ లీ ఫోటోలు వైరల్ – ప్రభాస్ “స్పిరిట్” సినిమాపై కొత్త ఊహాగానాలు
ప్రభాస్ నటించనున్న “స్పిరిట్” సినిమా చుట్టూ మరొక మిస్టరీ బలపడుతోంది. కొరియన్ యాక్షన్ స్టార్ డాన్ లీ తాజాగా టాలీవుడ్ నటులు తరుణ్, శ్రీకాంత్‌లతో కలసి ఫోటోలు దిగడంతో, ఈ సినిమా గురించి మరోసారి చర్చలు ముదిరాయి. నిన్న తరుణ్‌తో, నేడు శ్రీకాంత్‌తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రాలను చూసిన నెటిజన్లు డాన్ లీ స్పిరిట్ సినిమాలో భాగమా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. డాన్ లీ ఇప్పటికే ప్రభాస్ అభిమానుల్లో సుపరిచితుడే. స్పిరిట్ సినిమా కోసం పేరు వినిపించడం మొదలైనప్పటి నుంచే ఆయన వీడియోలు తెగ వైరలవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో డాన్ లీ ఖాతాను తెలుగు అభిమానులు హస్తగతం చేసేసినంత పని చేశారు.
స్పిరిట్‌లో డాన్ లీ పాత్రపై ఆగని ఊహాగానాలు
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న “స్పిరిట్” ప్రాజెక్టు, ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగానే ఎన్నో వివాదాలు, ఊహాగానాలతో నడుస్తోంది. మొదట హీరోయిన్ ఎంపికపై వివాదం రేగగా, దీపికా పదుకోణె పేరు చర్చల మధ్య త్రిప్తి డిమ్రీని అధికారికంగా ప్రకటించారు. ఇక డాన్ లీ పాత్రపై మాత్రం ఇప్పటికీ ఎలాంటి ప్రకటన లేదు.
ప్రభాస్ షెడ్యూల్ బిజీ, వంగా ఎదురుచూపు
ప్రభాస్ ప్రస్తుతం “రాజా సాబ్”, “ఫౌజీ” చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. మరోవైపు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా “స్పిరిట్” కోసం ఆయన డేట్స్ కోసం వేచి చూస్తున్నారు. ప్రభాస్ చేతిలో “సలార్ 2”, “కల్కి 2” ప్రాజెక్టులతో పాటు హోంబలే ప్రొడక్షన్స్‌తో రెండు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే.
డాన్ లీ హైదరాబాద్‌లోనేనా?
తాజా ఫోటోలు చూస్తే డాన్ లీ హైదరాబాద్‌లోనే మకాం వేసి ఉన్నట్టు కనిపిస్తోంది. టాలీవుడ్ నటులతో వరుసగా కలుస్తూ కనిపించడం చూస్తే, స్పిరిట్ కోసం ఏదో రహస్య ప్రిపరేషన్ జరుగుతున్నట్టు అభిప్రాయపడుతున్నారు అభిమానులు. అయితే ఈ ఊహాగానాలకు పుల్ స్టాప్ పెట్టే అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.
స్పిరిట్‌పై అంచనాలు – స్పష్టత ఎప్పుడంటే?
డార్లింగ్ అభిమానులు “స్పిరిట్” సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేసే ఉద్దేశంతో డాన్ లీ లాంటి యాక్షన్ స్టార్‌ను తీసుకున్నారా? లేక ఇదంతా కేవలం ప్రచార యంత్రాంగమా? అన్నది త్వరలో తెలుస్తుందని ఆశిస్తున్నారు.



