డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన | UFOలు, ఏలియన్ల రహస్య ఫైళ్లు విడుదల

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గ్రహాంతరవాసులు, యూఎఫ్ఓలు (UFOలు), అన్ ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా (UAPలు)కు సంబంధించిన ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన అన్ని ఫైళ్లను ప్రజలకు విడుదల చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇతర గ్రహాల్లో జీవం ఉండే అవకాశాలపై అమెరికా ప్రభుత్వం గత కొన్ని దశాబ్దాలుగా చేసిన పరిశోధనల వివరాలను కూడా బహిర్గతం చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేస్తూ వెల్లడించారు. గుర్తుతెలియని ఎగిరే వస్తువులు, గ్రహాంతరవాసులు, ఇతర గ్రహాల జీవానికి సంబంధించిన అన్ని రికార్డులను గుర్తించి, వాటిని వెంటనే డీక్లాసిఫై చేసి విడుదల చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.

ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, అలాగే ఇతర ఏజెన్సీల అధిపతులకు సూచనలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ పరిశోధనలు అత్యంత సంక్లిష్టమైనవి, ఆసక్తికరమైనవని, ప్రజలకు ఇవి తెలుసుకునే హక్కు ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

దశాబ్దాలుగా గ్రహాంతరవాసులు, యూఎఫ్ఓల అంశం ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో విస్తృత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనేక వింత సిద్ధాంతాలు, ఊహాగానాలకు దారి తీసిన ఈ అంశంపై అమెరికా చేసిన పరిశోధనల వివరాలు ఇప్పుడు వెలుగులోకి రానున్నాయి. ఇకపై యూఎఫ్ఓలకు సంబంధించిన ఏ ఫైల్ కూడా గోప్యంగా ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు.

గతంలో అమెరికా గగనతలంలో యూఎఫ్ఓలు కనిపించాయన్న వార్తలు పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. ఒక గ్రహాంతరవాసిని అమెరికా శాస్త్రవేత్తలు నిర్బంధంలోకి తీసుకున్నారన్న వాదనలు కూడా సోషల్ మీడియాలో చర్చకు వచ్చాయి. యూఎఫ్ఓలపై పరిశోధనలు జరిగినట్లు నాసా కూడా పరోక్షంగా సూచనలు చేసిన సందర్భాలున్నాయి.

అయితే, ఇప్పటివరకు ఈ ఫైళ్లలో ఏమి సమాచారం ఉందన్న దానిపై స్పష్టత లేదు. అమెరికా రక్షణ శాఖకు చెందిన పెంటగాన్ దశాబ్దాలుగా అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్, అన్ ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినాలపై పరిశీలన చేస్తోంది. 2024లో విడుదల చేసిన నివేదికలో ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ద్వారా గ్రహాంతరవాసుల ఉనికి నిర్ధారణ కాలేదని పెంటగాన్ స్పష్టం చేసింది. తాజాగా ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతో ఈ గోప్య సమాచారం మొత్తం బహిర్గతం కానుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి