దేశ రాజధానిలో భయానక ఘటన – ఎర్రకోట సమీపంలో కారులో భారీ పేలుడు, 13 మంది మృతి, పలు రాష్ట్రాల్లో హై అలర్ట్

న్యూఢిల్లీ:
దేశ రాజధానిలో మరోసారి భయానక ఘటన చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్‌లో నిలిపి ఉంచిన కారులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా కంపించిపోయింది. క్షణాల్లోనే మంటలు ఎగిసిపడగా, పరిసర వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే లోక్ నాయక్ జైప్రకాశ్ (LNGP) ఆసుపత్రికి తరలించారు.

పేలుడుతో ఢిల్లీ కుదేలైంది

పేలుడు తీవ్రత అంతగా ఉండటంతో సమీపంలోని వాహనాల అద్దాలు పగిలిపోయాయి. కారులోని ఇంధన ట్యాంక్ కారణంగా మంటలు మరింతగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి 10 అగ్నిమాపక వాహనాలు చేరుకుని మంటలను నియంత్రించాయి. సాయంత్రం 7:29 గంటలకు మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.

ఆసుపత్రి వర్గాల నివేదిక

LNGP ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, “మొత్తం 15 మందిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. వారిలో 8 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది” అని తెలిపారు. అనంతరం చికిత్స పొందుతూ మరికొందరు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 13కు చేరింది.

ప్రత్యక్ష సాక్షుల వివరణ

ఘటనా స్థల సమీపంలోని ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, “నేను సమీపంలోని గురుద్వారాలో ఉన్నాను. ఒక్కసారిగా గర్జనలతో కూడిన పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దం అంత భారీగా ఉండటంతో అందరం భయంతో బయటికి పరిగెత్తాము. కొన్ని క్షణాల్లోనే మంటలు చెలరేగాయి” అని తెలిపారు.

భద్రతా దళాల దిగ్బంధనం

పేలుడు అనంతరం ఢిల్లీ పోలీసులు మొత్తం ప్రాంతాన్ని దిగ్బంధనం చేశారు. ఎర్రకోటకు వెళ్లే అన్ని రహదారులు, మెట్రో స్టేషన్లు మూసివేయబడ్డాయి. ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), జాతీయ భద్రతా గార్డు (NSG) బృందాలు సాక్ష్యాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించాయి. అధికారులు రోడ్డుపై ఒక బులెట్‌ను కూడా గుర్తించారు.

కేంద్ర స్థాయిలో స్పందన

ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) చీఫ్‌లతో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అమిత్ షాకు ఫోన్ చేసి పేలుడు ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

దేశవ్యాప్తంగా హై అలర్ట్

ఎర్రకోట పేలుడు తర్వాత ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఉత్తరప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, “కారులో పేలుడు సంభవించింది. దాని వెనుక ఉన్న కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. సాయంత్రం 6:52 గంటలకు మొదటి సమాచారం అందింది” అని తెలిపారు.

భారత రాజధానిలో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. భద్రతా సంస్థలు, గూఢచారి విభాగాలు ఈ ఘటన ఉగ్రవాద దాడి కోణంలో కూడా పరిశీలిస్తున్నాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి