ఎర్రకోట పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులు అరెస్ట్ — ఘటనపై హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఎర్రకోట పేలుడు ఘటనలో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రకోట గేట్ నంబర్‌–1 సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద పార్క్ చేసిన కారులో ఈ భయానక పేలుడు సంభవించింది. తాజా సమాచారం ప్రకారం, ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కి పెరిగిందని, 24 మంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన ఇద్దరినీ విచారణ కోసం ప్రత్యేక బృందం ఢిల్లీ సదర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిని గంటలకొద్దీ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

హర్యానాకు చెందిన కారు అని నిర్ధారణ
పేలుడు జరిగిన కారు హర్యానా రాష్ట్రానికి చెందినదని పోలీసులు నిర్ధారించారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ హెచ్‌ఆర్‌ 26 7674గా గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఈ కారు నదీమ్ ఖాన్ అనే వ్యక్తి పేరుతో నమోదు అయి ఉందని అధికారులు తెలిపారు. పేలుడు సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, అందులో ఇద్దరి శవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడవ వ్యక్తి పరారీలో ఉన్నాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అమిత్ షా పరిశీలన – గాయపడిన వారిని పరామర్శ
ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఆయన మంగళవారం ఉదయం ఘటనాస్థలాన్ని సందర్శించి, పరిస్థితులను సమీక్షించారు. పేలుడు వెనుక ఉన్న ఉద్దేశ్యాలు, వాడిన పేలుడు పదార్థాల స్వరూపం గురించి సంబంధిత అధికారుల నుంచి సమగ్ర వివరాలు తీసుకున్నారు. అనంతరం ఆయన ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన బాధితులను పరామర్శించారు. క్షతగాత్రుల కుటుంబాలకు అవసరమైన వైద్య సదుపాయాలను తక్షణం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

పరిశోధన వేగం పెరిగిన పోలీసులు
ఘటనపై ఎన్‌ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. పేలుడు పదార్థాల అవశేషాలను స్వాధీనం చేసుకుని, వాటిని పరిశీలనకు పంపించారు. ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా లేదా అన్నదానిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా భయాందోళనలను రేకెత్తించగా, ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి