ఢిల్లీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు రేఖా గుప్తాపై బుధవారం ఉదయం దాడి జరిగింది. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు సీఎం రేఖా గుప్తా వారంవారీగా నిర్వహించే ‘జన్ సున్ వాయి’ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారిక నివాసంలో ప్రజలను కలుస్తున్న సమయంలో సుమారు 30 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు.
పోలీసుల ప్రకారం, దుండగుడిని గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్ సకారియాగా గుర్తించారు. సమస్యలు చెప్పుకునే పేరుతో ఆయన కొన్ని పత్రాలను ముఖ్యమంత్రికి అందించి, అనంతరం ఆకస్మికంగా ఆమెకు చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటన తర్వాత సీఎం రేఖా గుప్తాను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ సంఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్, మంత్రి మజిందర్ సింగ్ సిస్రాతో పాటు పలువురు నేతలు, ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉన్న అవకాశముందని ఆరోపించారు.
అదే సమయంలో, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశీ కూడా ఈ ఘటనపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు పరిష్కరించుకునే మార్గాలు ఉన్నాయని, కానీ దాడులు అసహనానికి, అశాంతికి దారితీస్తాయని ఆమె హెచ్చరించారు. ముఖ్యమంత్రిపై దాడిని తీవ్రంగా ఖండించిన ఆమె, భద్రతా వ్యవస్థలో లోపాలపై కఠిన విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం పోలీసులు దుండగుడు రాజేశ్ సకారియాను ప్రశ్నిస్తూ దాడి వెనుక ఉద్దేశాలను బయటపెట్టేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భద్రతా వైఫల్యం కోణంలో కూడా విచారణ జరుగుతోంది.



