ఢిల్లీలో శారదాపీఠం పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్న చైతన్యానంద అనే స్వామిజీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ ఆశ్రమం ఆధారంగా ఒక కాలేజీ నడుపుతూ, పేద కుటుంబాల విద్యార్థినులను చేర్చుకుని వారిని లైంగిక వేధింపులకు గురి చేశాడని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఇప్పటివరకు 17 మంది విద్యార్థినులు ఫిర్యాదులు చేసారు. విదేశాలకు తీసుకెళ్తానని, డబ్బులు ఇస్తానని నమ్మబలికి విద్యార్థినులను వేధించేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ దుశ్చర్యలకు ఆశ్రమంలోని మరికొందరు సహకరించారని సమాచారం.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు సుమారు 30 మంది విద్యార్థినులను విచారించగా, వారిలో 17 మంది తాము నిజంగా వేధింపులకు గురయ్యామని ధృవీకరించారు. దీనిపై కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించారు.
అయితే, అరెస్ట్ అవుతానని భయపడి చైతన్యానంద పరారయ్యాడు. చివరికి పోలీసులు ఆయనను ఆగ్రాలోని ఒక హోటల్‌లో దాక్కుని ఉన్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు.
ఇక, శంకరాచార్య మహాసంస్థానం శ్రీ శారదా పీఠం ఈ ఘటనపై స్పందించింది. “చైతన్యానందతో మాకు ఎలాంటి సంబంధం లేదు” అని స్పష్టం చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో “శారదాపీఠం” పేరుతో స్వరూపానంద అనే మరో స్వామిజీ ఒక ఆశ్రమం నడుపుతున్నప్పటికీ, అసలు శారదాపీఠానికి అతనికి ఎటువంటి సంబంధం లేదని వివరించింది.



