నేటి జీవనశైలిలో మానసిక ఒత్తిడి చాలా మందిని వెంటాడుతోంది.
పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ బాధ్యతలు మాత్రమే కాకుండా, తప్పు ఆహారపు అలవాట్లు కూడా మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. అధిక ఒత్తిడి వల్ల నిద్రలేమి, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.
అయితే, రోజువారీ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే ఆహారాలు
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల శరీరంలో సంతోషాన్ని కలిగించే హార్మోన్లు విడుదలవుతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడి హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే అధికంగా కాకుండా మితంగా మాత్రమే తీసుకోవాలి.
అరటిపండు
అరటిపండ్లు సులభంగా జీర్ణమవుతాయి. వీటిలో విటమిన్ బి6, పొటాషియం, ట్రిప్టోఫాన్ ఉంటాయి. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి సమయంలో అరటిపండు మంచి ఎంపికగా ఉంటుంది.
బాదం, వాల్నట్స్
బాదం, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌లో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి నరాల వ్యవస్థను బలపరచి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కొద్దిపాటి గింజలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
బెర్రీస్
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఒత్తిడి ప్రభావాల నుంచి రక్షించడమే కాకుండా, సంతోషకరమైన హార్మోన్ల విడుదలకు దోహదపడతాయి.
చిలగడదుంపలు
చిలగడదుంపల్లో విటమిన్ సి, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఒత్తిడి స్థాయిని తగ్గించి, శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో ఉండే ఎల్-థియనిన్ అనే సమ్మేళనం మనసుకు విశ్రాంతినిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో కెఫిన్ తక్కువగా ఉండటం వల్ల నిద్ర నాణ్యత కూడా మెరుగవుతుంది.
గమనిక
ఈ కథనంలో ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.



