రోజూ గుడ్డు పచ్చసొన తింటే ఏమవుతుంది? శరీరంలో జరిగే మార్పులు ఇవే

రోజూ గుడ్డు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పోషక నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో అధిక నాణ్యత గల ప్రోటీన్‌తో పాటు విటమిన్ డీ, విటమిన్ బి కాంప్లెక్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే గుడ్డులోని పచ్చసొనపై మాత్రం చాలామందిలో అపోహలు ఉన్నాయి. పచ్చసొన శరీరంలో వేడిని పెంచుతుందని, బరువు ఎక్కువ అవుతుందని భావిస్తుంటారు. అసలు గుడ్డు పచ్చసొన తినాలా? తింటే ఆరోగ్యానికి మేలా, హానికరమా? అనే సందేహాలకు నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

గుడ్డు పచ్చసొనలో గుండె ఆరోగ్యానికి అవసరమైన మంచి కొవ్వులు, హెచ్‌డీఎల్‌గా పిలిచే మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో ప్రోటీన్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. ఇవి అసంతృప్త కొవ్వులుగా పనిచేసి గుండెకు మేలు చేస్తాయి. పచ్చసొనలో రిబోఫ్లేవిన్, విటమిన్ బి-12 వంటి కీలక పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.

గుడ్డు పచ్చసొనలో ఐరన్, కోలిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కోలిన్ మెదడు అభివృద్ధికి, జ్ఞాపకశక్తి పెరుగుదలకు అవసరం. పచ్చసొనలో ఉండే అధిక నాణ్యత ప్రోటీన్ రోజంతా శక్తిని అందిస్తుంది. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు హెచ్‌డీఎల్ స్థాయిని పెంచి, శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్‌ను అందిస్తాయి. అంతేకాదు, విటమిన్ డి కాల్షియం శోషణకు తోడ్పడి ఎముకలను బలంగా ఉంచుతుంది.

అలాగే గుడ్డు పచ్చసొనలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మ స్థితిస్థాపకతను పెంచి, వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయడంలో సహాయపడతాయి. అయితే వయసు ఎక్కువైనవారు, గుండె సంబంధిత సమస్యలు లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు పచ్చసొన విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డు పచ్చసొనలో డైటరీ కొలెస్ట్రాల్ అధికంగా ఉండటంతో, ఎక్కువగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంది.

అలాగే గుడ్లకు అలర్జీ ఉన్నవారు పచ్చసొన తినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పచ్చి లేదా సరిగ్గా ఉడకని గుడ్డు పచ్చసొనలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండే ప్రమాదం ఉండటంతో, ఫుడ్ పాయిజనింగ్‌కు దారి తీస్తుంది. ఇందులో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉండటంతో అతిగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశమూ ఉంది. కొందరిలో జీర్ణ సమస్యలు కూడా తలెత్తవచ్చు.

అందుకే గుడ్డు పచ్చసొనను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్య పరిస్థితిని బట్టి, పరిమిత మోతాదులో తీసుకుంటే సమస్యలు లేకుండా గుడ్డు పచ్చసొన వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి