ప్రస్తుతం కరెంటు ధరలు పెరుగుతుండటంతో సామాన్యులపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ వినియోగాన్ని జాగ్రత్తగా నియంత్రించుకోవడం చాలా అవసరం. చిన్నచిన్న నిర్లక్ష్యాలు కూడా కరెంటు బిల్లును అనూహ్యంగా పెంచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం పెరిగి బిల్లులు మరింత భారంగా మారే సూచనలు ఉన్నాయి.
తరచూ కరెంటు సమస్యలు ఎదురవడం, అంచనాలకు మించి బిల్లులు రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో ముఖ్యమైన కారణం విద్యుత్ మీటర్లో ఏర్పడే సాంకేతిక లోపాలు. మీటర్ సరిగా పనిచేయకపోతే అధిక బిల్లులు రావడమే కాకుండా, అకస్మాత్తుగా కరెంటు కోతలు వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే కరెంటుకు సంబంధించిన ఏవైనా అసాధారణ మార్పులు కనిపిస్తే ముందుగా మీటర్‌ను తనిఖీ చేయడం అవసరం. మీటర్లో లోపం ఉంటే వినియోగం ఎక్కువగా చూపించి, బిల్లు పెరగడానికి దారి తీస్తుంది.
మీటర్లో సమస్యలు
విద్యుత్ మీటర్ చెడిపోవడానికి పలు కారణాలు ఉండవచ్చు. మీటర్ లోపల భాగాలు పగిలిపోవడం, వైర్లు కట్ అవడం లేదా దెబ్బతినడం వల్ల విద్యుత్ వినియోగం తప్పుగా నమోదు కావచ్చు. ఈ అవకతవకల కారణంగా అసలు వినియోగం కంటే ఎక్కువ యూనిట్లు చూపించి, బిల్లుపై అధిక భారం పడుతుంది. కొన్నిసార్లు మీటర్‌లోని అంతర్గత లోపాల వల్ల నిరంతరం కరెంటు ప్రవాహం ఉన్నట్లు రీడింగ్ వస్తుంది. ఈ పరిస్థితుల్లో సాధారణ వినియోగదారుడికి విషయం అర్థం కాకపోవచ్చు.
రెడ్ లైట్ బ్లింక్ను గమనించండి
మీటర్ సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఒక సులభమైన మార్గం ఉంది. ముందుగా ఇంట్లోని అన్ని లైట్లు, ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఆఫ్ చేసి, మెయిన్ స్విచ్‌ను కూడా ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మీటర్‌లోని రెడ్ లైట్‌ను గమనించాలి. ఎలాంటి వినియోగం లేకపోయినా రెడ్ లైట్ బ్లింక్ అవుతుంటే, మీటర్లో లోపం ఉన్నట్టు భావించాలి. ఇదే కారణంగా కరెంటు బిల్లు అధికంగా వస్తుండవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి. అవసరమైతే మీటర్‌ను మార్చించుకోవడం మంచిది. సమయానికి మీటర్ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే, అనవసరంగా పెరుగుతున్న కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం పొందవచ్చు.



