మెయిన్‌పురి అత్యాచార ఘటన: విద్యార్థి టీచర్‌పై భయంకర దాడి – ఉత్తరప్రదేశ్ క్రైమ్ తాజాగా

నేటి యువత ఆలోచనా ధోరణి ఏ దిశగా సాగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రోజుకో కలతపెట్టే సంఘటన వెలుగులోకి వస్తూ తల్లిదండ్రులను, సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. విలువలు, సంస్కారం, గౌరవం అనే మాటలు కొందరిలో పూర్తిగా కరిగిపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

తల్లిదండ్రుల తర్వాత దైవంతో సమానంగా పూజించాల్సిన గురువుల పట్లనే కొందరు విద్యార్థులు చూపిస్తున్న వైఖరి తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ‘ఆచార్య దేవోభవ’ అనే మహత్తర సంప్రదాయం ఉన్న మన సమాజంలో, విద్యాబుద్ధులు నేర్పే గురువులపై దాడులకు దిగడం అత్యంత దురదృష్టకరం. గురుశిష్యుల మధ్య ఉండాల్సిన పవిత్ర బంధానికి నేటి కొన్ని ఘటనలు చెరుపు పట్టిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఈ దారుణం జరిగింది. రాధాకృష్ణ ఇంటర్ కాలేజీలో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి, తన టీచర్‌పై కక్ష పెంచుకుని ఘాతుకానికి పాల్పడ్డాడు. గురువారం ఆమె క్లాస్ ముగించుకుని బయటకు వెళ్తుండగా అడ్డగించిన అతడు, ఆమెతో వాగ్వాదానికి దిగాడు. క్షణాల్లోనే పరిస్థితి హింసాత్మకంగా మారింది. తన వద్ద దాచుకున్న పదునైన ఆయుధంతో టీచర్‌పై దాడి చేసి, ఆమె పెదాలను కోసి క్రూరత్వాన్ని చాటుకున్నాడు. అంతటితో ఆగకుండా తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించగా, అది పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

బాధితురాలు భోగాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సదరు విద్యార్థి ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమె గతంలో పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం. అదే కారణంగా ఆమెపై పగ పెంచుకున్న విద్యార్థి, ప్రతీకార భావంతో ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.

ఘటన అనంతరం టీచర్ కేకలు వేయడంతో పాఠశాల సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను సైఫాయ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన విద్యార్థి పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని ఎస్పీ వినోద్ కుమార్ వెల్లడించారు. గురువుపై ఈ స్థాయి అమానుషానికి పాల్పడిన విద్యార్థికి కఠిన శిక్ష విధించాలని స్థానికులు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటన విద్యార్థుల మానసిక స్థితి, వారిలో పెరుగుతున్న నేర ప్రవృత్తికి అద్దం పడుతోందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి