ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు పోలీస్ స్టేషన్ ఎదుటే నడిరోడ్డుపై దారుణ హత్య చోటుచేసుకుంది. రాగినేపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరప్పను అతని అన్నదమ్ములు హరి, చెన్నప్ప కొడవళ్లతో విచక్షణారహితంగా నరికి హతమార్చారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెల 1న హరి భార్యను ఈశ్వరప్ప తీసుకెళ్లిన ఘటనపై హరి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈశ్వరప్పతో పాటు హరి భార్య గూడూరు ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆదివారం అక్కడికి వెళ్లి వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం తెల్లవారుజామున నిందితులను తనకల్లు పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో కారు నుంచి దిగి స్టేషన్‌లోకి వెళ్తుండగానే హరి, చెన్నప్పలు అకస్మాత్తుగా ఈశ్వరప్పపై దాడికి దిగారు. చేతుల్లో ఉన్న కొడవళ్లతో వరుసగా నరికడంతో ఈశ్వరప్ప అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనతో అక్కడే ఉన్న హరి భార్య తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన హరి, చెన్నప్పలను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
పోలీస్ స్టేషన్ ఎదుటే ఇంత దారుణ హత్య జరగడం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



