ప్రతీ ఇంటి వంటగదిలో ఆవ నూనె అనేది తప్పనిసరి. వంటల రుచి పెంచడమే కాకుండా ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణ, శరీర మసాజ్‌లకు కూడా ఆవ నూనెను విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే ఇటీవల కాలంలో మార్కెట్లో కల్తీ ఆవ నూనె విపరీతంగా పెరిగిపోవడంతో స్వచ్ఛమైన నూనెను గుర్తించడం వినియోగదారులకు పెద్ద సవాల్‌గా మారింది.
కల్తీ చేసిన ఆవ నూనె దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం. జీర్ణ సమస్యలు, హార్మోనల్ అసమతుల్యత, చర్మ సమస్యలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఆవ నూనెను కొనుగోలు చేసే ముందు లేదా వాడే ముందు దాని స్వచ్ఛతను నిర్ధారించుకోవడం చాలా అవసరం. దీనికోసం ఇంట్లోనే చేయగల కొన్ని సులభమైన పరీక్షలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వైట్ పేపర్ టెస్ట్
శుభ్రమైన తెల్ల కాగితం తీసుకుని దానిపై రెండు లేదా మూడు చుక్కల ఆవ నూనె వేయండి. కొంతసేపటి తర్వాత పరిశీలించండి.
- మరక పసుపు రంగులో ఉండి జిగటగా ఉంటే నూనె స్వచ్ఛమైనది.
- నూనె మరక పూర్తిగా వ్యాపించి కాగితం అంతా తడిసిపోయినట్లు కనిపిస్తే కల్తీ ఉండే అవకాశం ఉంది.
అయోడిన్ టెస్ట్
ఒక టీస్పూన్ ఆవ నూనెలో రెండు చుక్కల అయోడిన్ కలపండి.
- రంగు మారకపోతే నూనె స్వచ్ఛమైనది.
- నీలం లేదా నలుపు రంగు వస్తే స్టార్చ్ లేదా ఇతర కల్తీ పదార్థాలు కలిపినట్టు అర్థం.
అరచేతితో పరీక్ష
అరచేతిలో కొద్దిగా నూనె తీసుకుని రెండు చేతులతో రుద్దండి.
- సహజమైన ఘాటైన వాసన వస్తే అది అసలైన ఆవ నూనె.
- రసాయన వాసన, అసహజమైన వాసన వస్తే కల్తీ నూనె కావచ్చు.
వేడి చేసే పద్ధతి
ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి తేలికగా వేడి చేయండి.
- స్వచ్ఛమైన ఆవ నూనె వేడి చేసినప్పుడు ఘాటైన వాసనతో పాటు పొగ వస్తుంది.
- కల్తీ నూనె తక్కువ పొగతో మృదువైన వాసన ఇస్తుంది.
రుచి ద్వారా గుర్తించడం
పచ్చి ఆవ నూనెను కొద్దిగా రుచి చూసినప్పుడు నాలుకపై స్వల్ప మంట, చేదు రుచి అనిపిస్తుంది.
కల్తీ నూనె చప్పగా లేదా వింత రుచితో ఉంటుంది.
కొనుగోలు సమయంలో తప్పనిసరిగా చెక్ చేయాల్సినవి
ఆవ నూనెను కొనుగోలు చేసేటప్పుడు ప్యాకెట్‌పై
- బ్రాండ్ పేరు
- గడువు తేదీ
- FSSAI నెంబర్
తప్పకుండా పరిశీలించాలి.
ఈ సింపుల్ పద్ధతుల ద్వారా కల్తీ ఆవ నూనెను ఈజీగా గుర్తించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.



