ఆఫ్రికా ఖండంలోని కాంగోలో మరో భయానక విషాదం చోటుచేసుకుంది. లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో రాగి గనిలో ఇరుకైన వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో 32 మంది కార్మికులు దుర్మరణం పొందారు. ఈ ఘటనను ఆ దేశంలోని తాజా, అత్యంత ప్రాణాంతకమైన మైనింగ్ ప్రమాదాలలో ఒకటిగా గుర్తిస్తున్నారు.
కాంగోలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న ఈ సెమీ-ఇండస్ట్రియల్ మైనింగ్ సైట్‌లో ప్రతిరోజూ వందలాది మంది పని చేస్తుంటారు. అయితే ఈసారి ప్రమాదానికి కారణం కేవలం వంతెన బలహీనత మాత్రమే కాదని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలంలోనే సైనికుల నుంచి తుపాకీ కాల్పుల శబ్దం వినిపించడంతో కార్మికుల్లో భయాందోళనలు చలరేగాయి. ఆందోళనతో బయటపడేందుకు వందల సంఖ్యలో కార్మికులు ఇరుకైన వంతెన వైపు పరుగులు పెట్టారు. ఒక్కసారిగా భారీ జనసమ్మర్థాన్ని భరించలేని ఆ వంతెన కూలిపోగా, పలువురు లోతైన గుంతలో పడిపోయి దారుణంగా మరణించారు.
SAEMAPE (కాంగో ఆర్టిసానల్ మైనింగ్ ఏజెన్సీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం—
32 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ దేశం మంత్రి రాయ్ కౌంబా 32 మరణాలను అధికారికంగా ధృవీకరించారు. శవాలను వెలికితీయడం, గాయపడినవారిని రక్షించడం వంటి సహాయక చర్యలు ఆదివారం వరకూ కొనసాగాయి.
కాంగోలో రాగి గనులు లక్షలాది కుటుంబాలకు ఆదారంగా ఉన్నాయి. కనీసం 15–20 లక్షల మంది ప్రత్యక్షంగా ఈ గనుల్లో ఉపాధి పొందుతుండగా, మరెన్నో లక్షలాది మంది పరోక్షంగా ఆధారపడుతున్నారు. భద్రతా చర్యలు చాలా చోట్ల లేనట్టే ఉండటంతో గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు పలు మార్లు సంభవించాయి.
ఈ ఘటనకు ముందు సైనికులు–కార్మికుల మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానిక సమాచారం. దీంతో మానవ హక్కుల సంస్థ ఇనిషియేటివ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యుమన్ రైట్స్ ఈ ఘటనలో సైన్యం పాత్రపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తోంది.



