ప్రైవేట్ డాక్టర్లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి – ఏడాదికి ఒక్క నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించండి

cm-revanth-appeal-private-doctors-one-month-service-in-government-hospitals

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ రంగ వైద్యులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక విజ్ఞప్తి చేశారు. ఏడాదిలో కనీసం ఒక్క నెల రోజులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందించాలని ఆయన కోరారు. దీనివల్ల పేద ప్రజలకు నిపుణుల సేవలు లభించడమే కాకుండా, వైద్యులకు ఆత్మసంతృప్తి లభిస్తుందన్నారు.

బంజారాహిల్స్‌లో కొత్తగా ప్రారంభించిన ఏఐజీ (AIG) ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచుకునేలా అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ప్రైవేట్ డాక్టర్లు తమకు ఇష్టమైన ప్రభుత్వ దవాఖానాను ఎంచుకొని నెల రోజుల పాటు పని చేయవచ్చని సూచించారు. ఇది వారి వైద్య అనుభవాన్ని పేదలకు అందించడమే కాకుండా, ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరచడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. నిమ్స్, ఉస్మానియా వంటి ఆసుపత్రుల్లో పనిచేసే అవకాశం అనేది వైద్యుల దృష్టిలో అమూల్య అనుభవంగా నిలుస్తుందని వివరించారు.

అదనంగా, ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తోందన్నారు. నిమ్స్‌లో కొత్త బ్లాక్ నిర్మాణం, ఎల్బీనగర్, సనత్‌నగర్ ప్రాంతాల్లో కొత్త ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. త్వరలో 25 కొత్త ఆసుపత్రులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.

భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టి “తెలంగాణ రైజింగ్ – 2047” అనే విశాలమైన విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఇందులో హెల్త్ టూరిజం అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం వైద్య రంగంలో కీలక హబ్‌గా ఎదిగిన నేపథ్యంలో, గ్లోబల్ హెల్త్ హబ్‌గా తెలంగాణను మార్చేందుకు ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి