కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, సంస్కరణల దిశగా మరింత వేగంగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఇటీవల ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ బిల్లు ప్రకారం, ఒక ప్రజాప్రతినిధి 30 రోజులు వరుసగా కస్టడీలో ఉంటే, 31వ రోజునుంచే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు ఆటోమేటిక్‌గా తమ పదవులను కోల్పోవాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో, ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR)’ విడుదల చేసిన తాజా నివేదిక రాజకీయ వర్గాలను కుదిపేసింది. ఈ నివేదికలో దేశంలోని 31 మంది ముఖ్యమంత్రులపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించారు.
ఆ నివేదిక ప్రకారం –
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మొత్తం 89 కేసులు నమోదయ్యాయి. వీటిలో 72 తీవ్ర నేరారోపణలు ఉన్నాయి.
- తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్పై 42 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 19 కేసులు నమోదు అయ్యాయని, అందులో 32 తీవ్ర ఆరోపణలు ఉన్నాయని నివేదికలో ప్రస్తావించారు.
మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 13 మందిపై తీవ్రమైన నేరారోపణలతో కేసులు ఉన్నాయని ADR స్పష్టం చేసింది. వీటిలో హత్యా యత్నం, కిడ్నాప్, వేధింపులు, అవినీతి, లంచం వంటి కేసులు ఉన్నాయి. ఇవి రుజువైతే గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంది.
ఈ నివేదిక కేవలం ముఖ్యమంత్రులపై ఉన్న కేసుల గణాంకాలను మాత్రమే కాకుండా, భారత రాజకీయాల్లో నెలకొన్న నైతిక, పారదర్శకత సమస్యలను కూడా వెలుగులోకి తెచ్చింది. ప్రజాప్రతినిధులపై ఇంత భారీ స్థాయిలో కేసులు ఉండటమే ప్రజల్లో జవాబుదారీతనం, విశ్వసనీయతపై కొత్త చర్చలకు దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



