ఏపీ కూటమి ప్రభుత్వం సుసంపన్నంగా ఒక సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, తాము సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు ఇంటింటి ప్రచారానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలందరూ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విజయాలు వివరించాలని ఆదేశించారు.
ఇటీవల కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై వచ్చిన ప్రతికూల రిపోర్టుల నేపథ్యంలో, వారంతా జనంలోకి వెళ్లి తమ పనితీరును ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఈ క్రమంలోనే జూలై 2న కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లిలో ఇంటింటి ప్రచారాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన జూలై 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు కుప్పం చేరుకుంటారు. ఆ తర్వాత బుధవారం ఉదయం 8 గంటల నుంచి డోర్ టూ డోర్ ప్రచారంలో పాల్గొంటారు.
దాదాపు మూడు గంటల పాటు సాగనున్న ఈ ప్రచార కార్యక్రమంలో చంద్రబాబు తాను ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించనున్నారు.



