చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయకుడి గురించి తెలియని వారు ఉండరు. భూమి గర్భం నుంచి స్వయంగా వెలిసిన గణేశుడి ఆ ఆలయం ప్రపంచప్రసిద్ధి పొందింది. ఏటా కోట్లమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అక్కడికి చేరుతుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో చాలా మంది కాణిపాకం వినాయకుడిని కూడా తప్పనిసరిగా దర్శించుకుంటారు.
అయితే ఆంధ్రప్రదేశ్లో కాణిపాకం తరహాలోనే మరో స్వయంభూ గణేశ ఆలయం ఉందని చాలామందికి తెలియదు. అనకాపల్లి జిల్లాలోని చోడవరంలో గల ఈ దేవాలయం కూడా భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచేస్తుంది. ఇక్కడ ఉన్న విఘ్నేశ్వర స్వామి బావిలో స్వయంగా భూమి నుండి వెలసిన రాతి విగ్రహంగా పూజలందుకుంటున్నారు. సుమారు 200 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయం గురించి స్థానికులు గర్వంగా చెబుతుంటారు.
కాణిపాకం తర్వాత స్వయంభూగా వెలిసిన గణపతి ఆలయంగా చోడవరం విఘ్నేశ్వర ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది. ఏ కార్యం ప్రారంభించకముందు స్వామివారిని దర్శించుకుంటే ఆ పని విజయవంతమవుతుందని స్థానికులు నమ్మకం కలిగి ఉన్నారు. భక్తుల విశ్వాసం ప్రకారం, ఇక్కడి గణపతి విగ్రహం ప్రతి సంవత్సరం స్వల్పంగా పెరుగుతూ వస్తోంది.
దాదాపు 90 సంవత్సరాల క్రితం ముప్పావు కిలో వెండితో తయారు చేసిన కిరీటం, ఇప్పుడు అదే పరిమాణానికి తయారు చేయడానికి రెండు కిలోల వెండి అవసరమవుతోందని ఆలయ భక్తులు చెబుతున్నారు. ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో గర్భగుడి నీటితో నిండిపోవడంతో, ప్రస్తుతం స్వామివారు ‘జల గణపతి’గా భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
ఇక్కడ శివాలయం కూడా ప్రసిద్ధి చెందింది. ఆలయంలోని శివలింగం ఎల్లప్పుడూ నీటిలో తడిసే ఉంటుంది కాబట్టి భక్తులు ఆయనను గంగా సమేత శ్రీ గౌరీశ్వర స్వామిగా పూజిస్తారు. అలాగే విఘ్నేశ్వర ఆలయంలో కూడా నీరు ఎల్లప్పుడూ ఊరుతూ ఉంటుంది. వర్షాకాలంలో స్వామివారి తలభాగం మాత్రమే కనిపించడం ఇక్కడి ప్రత్యేకత.
ఈ ఆలయంలో అర్చక సేవలను పూర్వకాలం నుంచే కొడమంచిలి వంశీయులు నిర్వహిస్తున్నారు. బాలగణపతి సంఘం ఆధ్వర్యంలో ఆలయం క్రమంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం దేవదాయశాఖ పర్యవేక్షణలో ఈ పవిత్ర స్థలం భక్తుల ఆరాధన కేంద్రంగా కొనసాగుతోంది.



