చింతకాయలు, చింతపండుతో మనకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా 90వ దశకంలో పెరిగిన వారికి చింతచెట్ల జ్ఞాపకాలు ఓ ప్రత్యేకమైన అనుభూతి. వేసవి సెలవుల్లో, సంక్రాంతి పండుగల సమయంలో పల్లెటూర్లకు వెళ్లినప్పుడు చింతచెట్ల కింద చేసిన అల్లరి, పచ్చి చింతకాయ రుచి చూసిన క్షణాలు ఇప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటాయి. రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చింతపండు ఎంతో మేలు చేస్తుందన్న విషయం చాలా మందికి పూర్తిగా తెలియదు. ముఖ్యంగా చలికాలంలో చింతపండు లేదా చింతకాయలు తీసుకుంటే శరీరానికి ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ వంటకాలలో చింతపండు ఒక అనివార్యమైన పదార్థం. సాంబార్ నుంచి పులుసు వరకు, చట్నీల నుంచి కూరల వరకు చింతపండుకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే దీని ఉపయోగం కేవలం రుచికే పరిమితం కాదు. ఆరోగ్య పరిరక్షణలోనూ చింతపండు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉండటంతో పాటు విటమిన్ ఏ, సి, ఈ, కే, బీ6 వంటి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. అంతేకాదు మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి కాపాడటానికి సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో తగిన మోతాదులో చింతపండును చేర్చుకుంటే రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.
వాతావరణ మార్పుల సమయంలో, ముఖ్యంగా చలికాలంలో తరచూ వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షణ పొందడంలో చింతపండు ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ సీ ఇమ్యూనిటీని పెంచి శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. చలికాలంలో చాలా మందికి జీర్ణక్రియ మందగించడం సాధారణం. చలిని తగ్గించుకునేందుకు ఎక్కువగా టీ, కాఫీ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో చింతపండు తీసుకుంటే అందులోని సహజ ఆమ్లాలు జీర్ణక్రియను ఉత్తేజపరచి మెటబాలిజాన్ని చురుకుగా ఉంచుతాయి.
గుండె ఆరోగ్యానికి మేలు చింతపండు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిని సమతుల్యంగా ఉంచుతాయి. అలాగే చింతపండులో సమృద్ధిగా ఉండే పొటాషియం హార్ట్ బీట్‌ను నియంత్రించి రక్తపోటు సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది.
జుట్టుకు బలం, కాంతి చలికాలంలో చాలా మందిని వేధించే సమస్యల్లో చుండ్రు, జుట్టు రాలడం ప్రధానమైనవి. చింతపండులోని విటమిన్లు, ఖనిజాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి హెయిర్ ఫాల్‌ను తగ్గించి, తల చర్మానికి పోషణ అందిస్తాయి. క్రమం తప్పకుండా ఆహారంలో చింతపండును భాగం చేస్తే జుట్టు సహజంగా బలంగా, మెరుస్తూ ఉండేందుకు ఉపయోగపడుతుంది.
మొత్తానికి, చింతపండు కేవలం రుచిని పెంచే పదార్థమే కాదు. సరైన మోతాదులో తీసుకుంటే చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడే సహజ ఔషధంలా పనిచేస్తుంది.



