చైనీస్ మాంజా అమ్మినా వాడినా జైలు తప్పదు – హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక

సంక్రాంతి పండుగ అంటే గాలిపటాల సందడి తప్పనిసరి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తారు. అయితే ఈ ఆనంద వేళ కొందరు నిషేధిత చైనీస్ మాంజా వినియోగించడం తీవ్ర ప్రమాదాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 2016లోనే రాష్ట్రవ్యాప్తంగా చైనీస్ మాంజాపై నిషేధం విధించింది.

నైలాన్, సింథటిక్ దారాలతో తయారైన ఈ చైనీస్ మాంజా వల్ల పక్షులు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రాణాపాయానికి గురవుతున్నారు. గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో, హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఆన్‌లైన్ విక్రయాలపై ప్రత్యేక నిఘా

చైనీస్ మాంజా విక్రయాలపై పోలీసుల దాడులు ముమ్మరం చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. దుకాణాల్లో మాత్రమే కాకుండా, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు.

నిషేధిత చైనీస్ మాంజాను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
చైనీస్ మాంజా అమ్మినా.. వాడినా.. చట్టం ఊరుకోదు.. లోపలేస్తది” అంటూ సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.

103 కేసులు – 143 మంది అరెస్ట్

సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని నగర కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నగరవ్యాప్తంగా అన్ని జోన్లలో చేపట్టిన దాడుల్లో ఇప్పటివరకు:

  • 103 కేసులు నమోదు
  • 143 మంది నిందితులు అరెస్ట్
  • రూ.1.24 కోట్ల విలువైన 6,226 చైనీస్ మాంజా బాబిన్లు స్వాధీనం

చేసుకున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు.

ప్రజల సహకారం కోరుతున్న పోలీసులు

ప్రజలు తమ ప్రాంతాల్లో ఎక్కడైనా చైనీస్ మాంజా విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే:

  • డైల్ 100
  • లేదా పోలీస్ వాట్సప్ నంబర్: 9490616555

కు సమాచారం అందించాలని హైదరాబాద్ పోలీసులు కోరారు. నిషేధిత మాంజా వల్ల ప్రాణనష్టాన్ని నివారించడంలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి