చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఒక పర్యాటకుని నిర్లక్ష్యం భారీ ప్రమాదానికి దారితీసింది. కొండపై ఉన్న ప్రముఖ వెంచాంగ్ ప్యావిలియన్ ఆలయం దైవ ప్రార్థన కోసం వెలిగించిన కొవ్వొత్తి కారణంగా అగ్నికి ఆహుతైంది. ఆలయం మొత్తం కొద్దిసేపులోనే అగ్నికి ఆహుతై శిథిలాల కుప్పగా మారిపోయింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి చైనా ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
వెంచాంగ్ ప్యావిలియన్ ఆలయం మూడు అంతస్తుల అద్భుత నిర్మాణంతో, 2009లో పూర్తయినప్పటి నుంచి పర్యాటకులను ఆకట్టుకునే ప్రధాన హిల్-టాప్ టూరిస్టు స్పాట్‌గా పేరుపొందింది. స్థానిక ప్రజలు కూడా ఇక్కడ నియమితంగా పూజలు చేయడం, దైవారాధన కోసం కొవ్వొత్తులు వెలిగించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.
కానీ ఈ సంప్రదాయమే ఇప్పుడు ప్రమాదానికి కారణమైంది. ఈ నెల 12న ఆలయాన్ని సందర్శించిన ఓ యాత్రికుడు కొవ్వొత్తి వెలిగించి, దానిని నిర్ణీత సేఫ్టీ ప్రదేశంలో ఉంచకపోవడంతో ప్రమాదం జరిగింది. పక్కన పెట్టిన ఆ కొవ్వొత్తి కరిగి చెక్క నిర్మాణానికి మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపులోనే మంటలు మూడు అంతస్తులకూ వ్యాపించి మొత్తం ఆలయాన్ని దగ్ధం చేశాయి.
స్థానిక అధికారులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ, అప్పటికే ఆలయం పూర్తిగా శిథిలమైపోయింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, అగ్ని ప్రమాదానికి కారణం యాత్రికుడి నిర్లక్ష్యం అని పోలీసులు గుర్తిస్తున్నారు. ఘటనపై పూర్తి విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం ఆలయం పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు.



