సంక్రాంతి సంబరాల నడుమ నగర ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది చైనీస్ మాంజా. ఆకాశంలో ఎగిరే గాలిపటాల వెనుక దాగి ఉన్న ఈ మాంజాలు ఇప్పుడు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. పదునైన చైనా మాంజాలు తెగకపోవడం వల్ల రహదారులపై వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు.
ఇటీవల నగరంలో వరుసగా మాంజా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రజల్లో భయం నెలకొంది. ఎటునుంచి ఏ మాంజా వచ్చి మెడకు చుట్టుకుంటుందో అనే ఆందోళనతో బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. చైనీస్ మాంజాలు మాత్రమే కాకుండా, వాటిని అనుకరిస్తూ స్థానికంగా తయారవుతున్న కృత్రిమ మాంజాలు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి.
చైనా మాంజాపై ప్రత్యేక డ్రైవ్
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు చైనా మాంజాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న మాంజాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గాలిపటాల షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చైనా మాంజాలను సీజ్ చేస్తున్నారు.
పాతబస్తీ ప్రాంతంలో చార్మినార్ డివిజన్ డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులతో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసాంఘిక శక్తులు, అక్రమ వ్యాపారులపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
వాహనాల తనిఖీలు, సీజ్‌లు
ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నంబర్ ప్లేట్లు సరిగా లేని 130 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. రోడ్లపై ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతాయని డీసీపీ కిరణ్ కారే వెల్లడించారు.
ప్రజల్లో అవగాహన.. సేఫ్టీ రాడ్స్ పంపిణీ
చైనా మాంజాల ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో చార్మినార్ డివిజన్ డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. తన సొంత ఖర్చులతో మాంజా సేఫ్టీ రాడ్స్‌ను వాహనదారులకు పంపిణీ చేస్తూ ప్రమాదాల నుంచి రక్షణ పొందాలని సూచిస్తున్నారు. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో వందలాది రాడ్స్ పంపిణీ చేయడంతో ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పక్షులకు కూడా ముప్పు
చైనా మాంజాల వల్ల మనుషులే కాదు, అనేక పక్షులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. మాంజాలకు చిక్కుకుని విద్యుత్ స్తంభాలకు వేలాడుతూ మృతిచెందిన పక్షులు నగరంలోని పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు ప్రజలను కలచివేస్తున్నాయి.
చైనా మాంజా అమ్మకం నేరమే
చైనా మాంజాలను అమ్మినా, కొనుగోలు చేసినా నేరమేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుల్జార్ హౌస్, ధూల్‌పేట్ పరిసరాల్లో అక్రమ విక్రయాలపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. నగరవ్యాప్తంగా తనిఖీలు మరింత కఠినతరం చేస్తామని, చైనా మాంజాలు ఎక్కడ పట్టుబడ్డా కేసులు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో చైనా మాంజాల వినియోగం పూర్తిగా నివారించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.



