వరదలో ప్రాణాల కోసం తిప్పలు… రైతు డ్రోన్‌తో రక్షణ!

china-farmer-saves-man-with-drone-in-flood-viral-video

గ్వాంగ్‌జీ (దక్షిణ చైనా): టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే ఎలా ప్రాణాలను కాపాడుకోవచ్చో చైనాలో ఓ రైతు చూపించాడు. వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే డ్రోన్‌ను ప్రాణాపాయంలో చిక్కుకున్న వ్యక్తి రక్షణ కోసం వినియోగించిన ఘటన అక్కడ తలెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే… దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జీ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వరదలు ముప్పుతిప్పులు పెట్టాయి. లియుజౌ నగరంలో ఒక వ్యక్తి వరద నీటిలో చిక్కుకుపోయి తన రెండు అంతస్తుల ఇంటి పైకప్పుపై సహాయానికి కేకలు వేసేవాడు. అయితే ఆ ప్రాంతానికి రెస్క్యూ బోట్లు చేరుకోలేని పరిస్థితి నెలకొంది.

అయితే అదే సమయంలో అతని పొరుగింటి రైతు లై స్పందన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. వ్యవసాయ డ్రోన్‌తో పురుగు మందులు చల్లే పనికే పరిమితమని అందరూ భావిస్తారు. కానీ లై ఆ డ్రోన్‌ సాయంతో ఆ వ్యక్తిని కాపాడాడు. 100 కిలోల బరువు మోయగల సామర్థ్యమున్న డ్రోన్‌కు తాడుతో ఇసుక సంచిని కట్టి, అందులో సేఫ్టీ బకిల్‌ను అమర్చాడు. ఆ వ్యక్తికి ఫోన్ చేసి… సంచిపై కూర్చుని సురక్షితంగా తాడుతో కట్టుకోవాలని సూచించాడు.

ప్రాణాల కోసం పోరాడుతున్న ఆ బాధితుడు లై సూచనల మేరకు డ్రోన్‌కు చుట్టుకుని వేలాడుతూ కనిపించాడు. డ్రోన్‌ సుమారు 65 అడుగుల ఎత్తులో ఎగురుతూ, చెట్లు, పైలాన్‌ల మధ్యుగా చాకచక్యంగా ప్రయాణించి… అతడిని సురక్షితంగా రోడ్డుపైకి దించి ప్రాణాలు రక్షించింది.

ఈ సందర్భంగా రైతు లై మాట్లాడుతూ… గతేడాది ఆగస్టులోనే డ్రోన్ ఆపరేషన్ నేర్చుకున్నానని వెల్లడించాడు. ‘‘ఇది చట్టబద్ధం కాదు అని నాకు తెలుసు. కానీ ఆ వ్యక్తి కళ్ళెదురుగా ప్రాణాల మీదకు వచ్చాడు. ఇల్లు కూలిపోతుందేమోనన్న భయం. అందుకే ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యతగా భావించి, నా డ్రోన్‌ను వినియోగించా. కానీ ఎవరూ ఇలా చేయమని నేను సూచించను’’ అని తెలిపారు.

ఈ సంఘటన మరోసారి టెక్నాలజీ హుందాగా వినియోగిస్తే ఏవైనా సాధ్యమేనని రుజువు చేస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి