చైనాలో గాల్లో మంటలు చెలరేగిన ఎయిర్ చైనా విమానం – అప్ర‌మత్త‌తతో పెద్ద ప్రమాదం తప్పింది

చైనాలో మరోసారి వైమానిక ప్రమాదం తృటిలో తప్పింది. గాల్లో విహరిస్తున్న ఓ ఎయిర్ చైనా ప్యాసింజర్ విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ప్రయాణికులలో ఆందోళన కలిగించింది. సకాలంలో విమాన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఘటన శనివారం (అక్టోబర్ 18) ఉదయం చోటుచేసుకుంది. చైనాకు చెందిన ఎయిర్ చైనా విమానం (ఫ్లైట్ నంబర్ CA139), ఈస్ట్రన్ చైనాలోని హ్యాంగ్‌జౌ నగరం నుంచి దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. సుమారు మధ్యగగనంలో ఉన్న సమయంలోనే ఓ ప్రయాణికుడి లగేజీ బ్యాగులోని లిథియం బ్యాటరీలో మంటలు చెలరేగాయి.

వెంటనే మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో సిబ్బంది చురుకుగా స్పందించారు. పైలట్‌కు సమాచారం అందించగా, విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కోసం సిద్ధం చేశారు. క్షణాల్లోనే నిర్ణయం తీసుకుని షాంగైలోని పుడోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది తక్షణ చర్యతో మంటలను అదుపులోకి తెచ్చారు.

అదృష్టవశాత్తు, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విమానంలో 169 మంది ప్రయాణికులు, 7 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు.

ఘటన సమయంలో ఓ ప్రయాణికుడు తీసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో విమానంలో ఒక మూలన మంటలు చెలరేగి, దట్టమైన పొగ కమ్ముకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వ్యక్తి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యమూ అందులో ఉంది. చైనాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన జిము న్యూస్ ఛానల్ ఆ ఫోటోను ప్రసారం చేసింది.

విమానంలో మంటలు ఎందుకు చెలరేగాయో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. లిథియం బ్యాటరీ సేఫ్టీ నియమాలు, ప్రయాణికుల లగేజీ స్క్రీనింగ్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.

అధికారుల ప్రకారం, “విమానాన్ని షాంగైలో కొంత సమయం నిలిపి ఉంచి పూర్తిగా తనిఖీ చేశాం. మంటలను పూర్తిగా ఆర్పేశాం. ప్రాణ నష్టం జరగకపోవడం అదృష్టకరం” అని పేర్కొన్నారు.

గతంలోనూ చైనాలో లిథియం బ్యాటరీల వల్ల అనేక విమానాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన మరోసారి బ్యాటరీ సేఫ్టీ నియమాల పట్ల విమానయాన సంస్థలు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి