మాంసాహార ప్రియులకు చికెన్ అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఆదివారం వచ్చిందంటే చికెన్ వంట తప్పనిసరి. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన పచ్చి చికెన్‌ను మీరు సరైన విధంగా శుభ్రం చేస్తున్నారా? చాలామంది సాధారణ నీటితో రెండు మూడు సార్లు కడిగి వెంటనే వంట మొదలుపెడతారు. కానీ నిపుణుల మాట ప్రకారం ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది.
సాధారణ నీటితో కడగడం ఎందుకు సరిపోదు?
పచ్చి చికెన్‌లో క్యాంపిలోబాక్టర్, సాల్మోనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటాయి. వీటిని కేవలం నీటితో కడగడం వల్ల అవి నశించవు. అంతేకాదు, నీరు చిందర వందరగా చల్లబడటం వల్ల సింక్, వంట పాత్రలు, వంటగది చుట్టూ బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కూడా కారణమవుతుంది.
నిమ్మరసంతో చికెన్‌ను ఇలా శుభ్రం చేయండి
చికెన్ శుభ్రం చేయడానికి నిమ్మరసం చాలా ఉపయోగకరం.
- ఒక లీటరు గోరువెచ్చని నీటిలో
- 2–3 టీస్పూన్ల నిమ్మరసం కలపండి
- చికెన్ ముక్కలను ఈ నీటిలో వేసి సుమారు 5 నిమిషాలు నానబెట్టండి
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పచ్చి మాంసం నుంచి వచ్చే దుర్వాసనను తొలగించి చికెన్‌ను తాజాగా ఉంచుతుంది. చాలామంది ప్రొఫెషనల్ చెఫ్‌లు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తారు.
ఉప్పు, పసుపు నీటితో అదనపు భద్రత
మరో సురక్షితమైన పద్ధతి ఉప్పు–పసుపు నీరు.
- ఒక లీటరు గోరువెచ్చని నీటిలో
- 2 టీస్పూన్ల ఉప్పు
- చిటికెడు పసుపు కలపండి
ఈ మిశ్రమంలో చికెన్‌ను కొద్దిసేపు ఉంచి తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఉప్పు, పసుపు సహజ యాంటీ సెప్టిక్‌లుగా పనిచేసి సూక్ష్మజీవులను అరికడతాయి.
రుచి కూడా మెరుగుపడుతుంది
నిమ్మరసం లేదా వెనిగర్‌తో చికెన్‌ను శుభ్రం చేయడం వల్ల మాంసం మెత్తగా మారుతుంది. దీంతో వంటలో మసాలాలు బాగా పట్టి, కూరలు లేదా ఫ్రైలకు అద్భుతమైన రుచి వస్తుంది.
సరైన విధంగా చికెన్‌ను శుభ్రం చేయడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవడమే కాదు, వంట రుచిని కూడా రెట్టింపు చేయవచ్చు.



